వందేభారత్ రైల్వే ప్రాజెక్టు నుంచి చైనా కంపెనీ ఔట్.. పోటీలో ఉన్న మూడు స్వదేశీ కంపెనీలు
చైనా కంపెనీకి మరో షాక్ తగిలింది. ‘వందేభారత్’ ప్రాజెక్టులో భాగంగా 44 ట్రైన్‌సెట్ల తయారీ కోసం బిడ్ దాఖలు చేసిన చైనా సంస్థపై ఇండియన్ రైల్వే అనర్హత వేటు వేసింది...
Vande Bharat Project : చైనా కంపెనీకి మరో షాక్ తగిలింది. వందేభారత్ ప్రాజెక్టులో భాగంగా 44 ట్రైన్‌సెట్ల తయారీ కోసం బిడ్ దాఖలు చేసిన చైనా సంస్థపై ఇండియన్ రైల్వే అనర్హత వేటు వేసింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ. 1,800 కోట్లు. చైనా సంస్థపై వేటు పడడంతో ఇప్పుడు బీహెచ్‌ఈఎల్(BHEL), మేధా సెర్వో డ్రైవ్స్ మాత్రమే రేసులో నిలిచాయి.
కాగా, మేధా ఇప్పటికే తొలి రెండు రైళ్ల తయారీ కాంట్రాక్ట్‌ను అతి తక్కువ బిడ్ ద్వారా దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం మూడు సంస్థలు బిడ్ దాఖలు చేశాయి. ఇందులో సీఆర్ఆర్‌సీ(CRRC) -పయనీర్ ఎలక్ట్రిక్ ఇండియా కూడా ఉంది. ఇది చైనాలోని బీజింగ్‌కు చెందిన సీఆర్ఆర్‌సీ(CRRC) యోగ్జి ఎలక్ట్రిక్ లిమిడెట్, భారత్‌కు చెందిన పయనీర్ ఫిల్-మెడ్ లిమిడెట్ జాయింట్ వెంచర్. దీని ప్లాంట్ హర్యానాలో ఉంది.
టెండర్లను అంచనా వేసి తుది నిర్ణయం తీసుకోవడానికి భారతీయ రైల్వేకు దాదాపు నాలుగు వారాలు పట్టింది. టెండర్ కమిటీ చెల్లుబాటు అయ్యే బిడ్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుందని రైల్వే ఇదివరకు స్పష్టం చేసింది.
ట్రైన్ సెట్ ప్రొక్యూర్‌మెంట్ టెండర్‌కు బిడ్ దాఖలు చేయడానికి ముందు సీఆర్ఆర్‌సీ(CRRC)-పయనీర్ ఎలక్ట్రిక్ ఇండియా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ కాంట్రాక్టు కోసం బిడ్ దాఖలు చేసే కంపెనీ యజమాన్యం భారత్‌కు చెంది ఉండాలన్న నిబంధన ఉంది. దీంతో ఈ సంస్థ దాఖలు చేసిన బిడ్‌ను భారతీయ రైల్వే పరిగణనలోకి తీసుకోలేదు.