భారత నేవీలోకి మరో కలికితురాయి.. గోవా చేరుకున్న అత్యాధునిక పొసిడాన్‌ 8ఐ యుద్ధ విమానం

భారత నావికా దళంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. దేశ భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ బారత సైన్యానికి అత్యాధునిక సంపదను చేకూరుస్తున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 8:28 pm, Thu, 19 November 20
భారత నేవీలోకి మరో కలికితురాయి.. గోవా చేరుకున్న అత్యాధునిక పొసిడాన్‌ 8ఐ యుద్ధ విమానం

భారత నావికా దళంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. దేశ భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ బారత సైన్యానికి అత్యాధునిక సంపదను చేకూరుస్తున్నారు. సముద్ర జలాలపై గస్తీ తిరుగుతూ సుదూరం నుంచే శత్రు దేశాల జలాంతర్గాములను వేటాడే అత్యాధునిక పొసిడాన్‌ 8ఐ(పీ8ఐ) యుద్ధ విమానం భారత నౌకాదళ అమ్ములపొదిలో చేరింది. అమెరికా రూపొందించిన ఈ విమానం బుధవారం గోవాలోని ఐఎన్‌ఎస్‌ హన్స నౌకా స్థావరంలో దిగింది.

అత్యంత శక్తిమంతమైన ఎలక్ట్రో ఆప్టిక్‌ సెన్సర్ల వ్యవస్థతో, రాడార్ల సాయంతో జలాంతర్గాముల ఆనుపానులు కనిపెట్టి, ఆయుధాలతో విరుచుకుపడటం దీని ప్రత్యేకత. 907 కి.మీ గరిష్ఠ వేగంతో, 1,200 నాటికల్‌ మైళ్ల పరిధి నిఘా సామర్థ్యంతో, ఏకధాటిగా నాలుగు గంటల పాటు గస్తీ తిరిగే సౌలభ్యంతో ఈ విమానాలు నౌకా దళానికి కీలకంగా మారాయి అగ్రరాజ్యం అందించనున్న నాలుగు పీ8ఐ యుద్ధ విమానాల్లో ఇది మొదటిది. ఈ నాలుగు విమానాల తయారీకి సంబంధించి 2016 జులైలో అమెరికాతో 1.1 బిలియన్‌ డాలర్లతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. మిగిలిన మూడు పీ8ఐ విమానాలు వచ్చే ఏడాదికల్లా సిద్ధమవుతాయని రక్షణవర్గాలు తెలిపాయి. కాగా, ఇప్పటికే భారత్‌ వద్ద 8 పీ8ఐ విమానాలు అందుబాటులో ఉన్నాయి. హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా నౌకలు, జలాంతర్గాములపై నిఘా వేయడానికి వీటిని వినియోగిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో లడాఖ్‌ ప్రాంతంలో గస్తీ కోసమూ వీటిని ప్రస్తుతం వినియోగిస్తోంది నేవీ ఫోర్స్. అత్యాధునిక పొసిడాన్‌ 8ఐ(పీ8ఐ) యుద్ధ విమానాలు వచ్చి చేరడంతో భారత రక్షణ రంగం మరింత బలపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.