
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. నిత్యం పెరుగుతున్న కొత్త కేసులతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. అయితే, కొవిడ్ తోపాటు ఇతర భయంకర వైరస్ లను నుంచి విముక్తి కలిగించేందుకు భారతదేశానికి చెందిన ఓ స్టార్టఫ్ కంపెనీ వినూత్నంగా ఆలోచన చేసింది. తాము తయారీ చేసిన టీ షర్టును ధరిస్తే ఎటువంటి వైరస్ అయినా దరి చేరదంటోంది. కొవిడ్ బారి నుంచి రక్షణ కల్పించే సరికొత్త టీషర్టులు, కెమికల్ లిక్విడ్ లోషన్ ను మన దేశానికి చెందిన రెండు స్టార్టఫ్ కంపెనీలు అభివృద్ధి చేశాయి. తక్కువ ధరకే అవి విపణిలో అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఇ-టెక్స్, క్లెన్స్‌టా అనే రెండు కంపెనీలు ఐఐటీ ఢిల్లీలో ఆధ్వర్యంలో వీటికి రూపకల్పన చేశాయి. ఇ-టెక్స్’ యాంటీ వైరల్ ఫ్యాబ్రిక్‌తో తాజాగా టీ-షర్టులను తయారు చేసింది. వాటి మనం ధరించడం ద్వారా మనకు వైరస్ సోకే ప్రమాదం లేదంటుంది సదరు కంపెనీ. టీ షర్ట్ ను తాకితే కరోనా వైరస్ సహా ఏ సూక్ష్మజీవులైనాసరే అంతమైపోతుందట. 30 సార్లు ఉతికిన తర్వాత కూడా యాంటీ వైరల్ సామర్థ్యాన్ని కోల్పోకపోవడం ఈ టీషర్టుల ప్రత్యేకత అని ఇ-టెక్స్ సంస్థ పేర్కొంది. వాటిపై ఉండే రసాయనం మానవులకు, ప్రకృతికి ఏమాత్రం హానికరం కాదని నిపుణులు తేల్చారు. మరోవైపు, తాము రూపొందించిన కెమికల్ లిక్విడ్ 99.9 శాతం వరకు సూక్ష్మక్రిములను నాశనం చేయగలదని క్లెన్స్‌టా సంస్థ తెలిపింది. ఒక్కసారి ఒంటిపై పూసుకుంటే 24 గంటల వరకు అది ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించింది. ఇ-టెక్స్ టీషర్టులు, క్లెన్స్‌టా లోషన్ తో కూడిన కిట్‌లను ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వి.రామ్‌గోపాల్ రావు శుక్రవారం ఆవిష్కరించారు. వీటిని అతి తక్కువ ధరకే విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. త్వరలో దేశీయ మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు వారు వెల్లడించారు.