
లాక్ డౌన్ సడలింపులతో నేటినుంచి దేశవ్యాప్తంగా హోటళ్లు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి కంచర్ల టీవీ9 తో మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని 15 వేలకు పైగా హోటళ్ళు, రెస్టారెంట్లు తెరుచుకున్నాయని చెప్పారు. ప్రతి హోటల్ ముందు నో మాస్క్, నో ఎంట్రీ బోర్డులు తప్పనిసరి అని తెలిపారు. అయితే.. సిబ్బంది కొరతతో 65% హోటళ్ళు మాత్రమే తెరుచుకున్నాయని, వలస కార్మికులు తిరిగి రాకపోవడంతో సిబ్బంది కొరత వెంటాడుతుందని వెల్లడించారు. 50 నుంచి 60% హైదరాబాద్ హోటళ్లలో పనిచేస్తున్న వారు మైగ్రాంట్ లేబర్ అని, కేవలం 30 నుంచి 40 % హోటళ్ళు మాత్రమే లోకల్ సిబ్బందితో పనిచేస్తున్నాయని తెలిపారు.
మైగ్రాంట్ లేబర్ లేకపోవడంతో లోకల్ లేబర్ లతో పని చేయిస్తున్నామని అయన వివరించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా నుంచి కార్మికులు రావాల్సి ఉందని తెలిపారు. వెస్ట్ బెంగాల్ నుంచి స్వీట్స్ తయారీకి కుక్ లు రావాల్సి ఉందన్నారు. అద్దె, పవర్ చార్జీల భారంతో 20 నుంచి 25 శాతం ఖర్చులు పెరుగుతాయని, కానీ కస్టమర్లపై ఇప్పుడే ఛార్జీలు పెంచే యోచన లేదని స్పష్టంచేశారు. కాగా.. పరిశ్రమ కోలుకోవడానికి ఏడాది కాలంపడుతుందని, ఈ రెండు సంవత్సరాలకు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు రద్దు చేయాలని విన్నవించారు.
Also Read: కరోనాపై విజయం.. యాక్టివ్ కేసులు లేని దేశంగా..