దిశ నిందితుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవాళ ఈ కేసులో విచారణ జరిపిన హైకోర్టు నలుగురు నిందితుల మృతదేహాలకు రీ-పోస్టుమార్టం జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం నిర్వహించాలని.. ఆ ప్రక్రియను వీడియో రికార్డు చేయాలని కోర్టు తెలిపింది. ఇక ఇదంతా ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా పూర్తి కావాలని స్పష్టం చేసింది.
అంతేకాకుండా ఎన్‌కౌంటర్‌కు సంబంధించి బుల్లెట్స్, గన్స్ మాత్రమే కాకుండా ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్ట్‌లను సైతం భద్రపరచాలని హైకోర్టు సూచించింది. కాగా, రీ పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత పోలీసుల సమక్షంలో నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ బెంచ్ తెలిపింది.