Hema Malini on Farmers : రైతులకు ఏం కావాలో వారికి తెలియదంటూ కామెంట్ చేశారు బీజేపీ ఎంపీ హేమామాలిని. కేంద్రం తీసుకొచ్చిన నూతన చట్టాలకు వ్యతిరేకంగా కొందరు రైతులను ఉసిగొల్పుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. చట్టాల అమలు వల్ల వచ్చే నష్టాలేంటో రైతులకు తెలియవని అన్నారు. చట్టాలపై సుప్రీం స్టే విధించడాన్ని ఎంపీ స్వాగతించారు.
ఇలా చేయడం ద్వారా ఇరు వర్గాలూ శాంతించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న వాతావరణాన్ని కాస్త మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. ఇన్నిసార్లు చర్చలు జరిగినా, రైతులు ఏకాభిప్రాయానికి రావడం లేదు… వారికి ఏం కావాలో కూడా వారికి తెలియదు… అంతేకాకుండా నూతన చట్టాలతో వచ్చే నష్టాలేంటో కూడా వారికి తెలియదు… ఎవరో కొందరు వ్యక్తులు నిరసన చేయమంటే వీరు ఇలా చేస్తున్నారు అని ఎంపీ హేమా మాలిని చెప్పుకొచ్చారు.
వివాదాస్పదంగా మారిన మూడు సాగు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వ వాదనలన్నింటినీ పక్కకు పెట్టిన కోర్టు- చర్చల్లో నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించి సమస్యకు ఓ పరిష్కారం సాధించేందుకు నలుగురు నిపుణులతో ఓ కమిటీని వేసింది.