మళ్ళీ వర్షగండం… భయపడొద్దన్న కేటీఆర్

హైదరాబాద్ మహానగరానికి మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల ముప్పు ముందంటూ వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో మునిసిపల్ మంత్రి కే.తారక రామారావు...

మళ్ళీ వర్షగండం... భయపడొద్దన్న కేటీఆర్
Follow us

|

Updated on: Oct 19, 2020 | 2:26 PM

Heavy rain again, KTR says dont worry:  హైదరాబాద్ మహానగరానికి మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల ముప్పు ముందంటూ వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో మునిసిపల్ మంత్రి కే.తారక రామారావు సిటీ ప్రజలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు 112 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ మహానగరం ఇంతటి భారీ స్థాయిలో వర్షాలను చూస్తోందని, అయితేనేం ప్రభుత్వం ఎలాంటి విపత్కర పరిస్థితిలోనై సిటీ ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ప్రణాళికతో రెడీగా వుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. సిటీలో వరద పరిస్థితిని ఆయన సోమవారం సమీక్షించారు. తాజాగా మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశముందన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికను మంత్రి ప్రస్తావించారు.

‘‘ హైదరాబాద్ వర్షాలపై రెండు గంటల పాటు సమీక్ష నిర్వహించాము.. హైదరాబాద్ చరిత్రలోనే ఇది రెండవ అతిపెద్ద వర్షం… 1908లో సెప్టెంబర్ 28న ఒక్క రోజే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యధికంగా మళ్ళీ 112 ఏళ్ళ తరువాత ఆస్థాయిలో వర్షం పడింది.. 40ఏళ్లుగా నేను హైదరాబాద్ నగరంలోనే ఉంటున్నాను.. ఎప్పుడూ ఇంతటి వర్షం చూడలేదు… ’’ అని కేటీఆర్ అన్నారు.

వందల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని, దాదాపు 80 మంది సీనియర్ అధికారులు ప్రజలను ఆదుకునే కార్యక్రమంలో శ్రమిస్తున్నారని మంత్రి వివరించారు. 37వేల కిట్ల నిత్యావసర సరుకులు అందిస్తున్నామని ఆయన చెప్పారు. శిథిలావస్థకు చేరిన నిర్మాణాల కూల్చివేత మొదలు పెట్టామని తెలిపారు. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే 45 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పారు.

ప్రస్తుతం 80 ప్రాంతాల్లో నీళ్లు నిలిచి వున్నాయని, అపార్ట్‌మెంట్లకు విద్యుత్ పునరుద్ధరిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. సౌత్ హైదరాబాద్‌లో ఎక్కువ వర్షం ప్రభావం ఉందని ఆయన అంటున్నారు. కేంద్రానికి హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన నష్టంపై నివేదిక పంపామన్నారు. జీహెచ్ఎంసీలో 670 కోట్ల తాత్కాలిక నష్టం జరిగిందంటూ కేంద్రానికి డిటెయిల్డ్ రిపోర్ట్ పంపామన్నారు.

అయితే, రాష్ట్ర పంపిన వరద రిపోర్టుపై కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు కేటీఆర్. గడిచిన వారం రోజులుగా 59 శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను తొలగించామన్నారు. ‘‘ రాబోయే మూడు రోజులు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం అలర్ట్ చేసింది.. మూడు చెరువు తెగడం వల్ల భారీ నష్టం జరిగింది. నగరంలో చెరువులు ఆక్రమణకు గురైనట్లు మా దగ్గర డిటెల్ సమాచారం ఉంది.. మా దృష్టి అంతా ప్రజలకు ప్రాణనష్టం జరగకుండా పెట్టాము.. GHMC దగ్గర 18 బోట్లు ఉన్నాయి.. ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి మరో 15 బోట్లు రెడీగా పెట్టుకుంటాం.. ’’ అని వివరించారు. ఆర్మీ, NDRF బృందాలతో మాట్లాడామని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకునేలా ప్రణాళికతో రెడీగా వున్నామని కేటీఆర్ వివరించారు.

Also read: బహిరంగచర్చకు రెడీ.. బండికి హరీశ్ సవాల్

Also read: కిస్తులు కట్టిన వారికి త్వరలో మోదీ సర్కార్ శుభవార్త!