Harishrao challenges Bandi Sanjaykumar: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం క్రమంగా ఆరోపణలు, విమర్శలతో వేడెక్కుతోంది. మూడు ప్రధాన పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ ప్రచారాన్ని రక్తికట్టిస్తున్నారు. తాజాగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు.. బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతల గోబెల్స్ ప్రచారానిక అడ్డూఅదుపు లేకుండా పోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అసత్య ప్రచారం ఏ మాత్రం మంచిది కాదని హరీశ్ రావు కమలనాథులకు హితవు పలికారు.
దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఎదురు తిరుగుతున్నారని, పార్టీ జెండా గద్దెలను కూలగొట్టి, నేతలను నిలదీస్తున్నారని అంటూ బీజేపీ నేతలు సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. గతంలో కల్వకుర్తిలో జరిగిన సంఘటనను దుబ్బాకలో ప్రస్తుతం జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద దుబ్బాకకు సీఎం ఇచ్చిన నిధులు దుర్వినియోగం అయినట్లు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల అసత్యప్రచారంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు.
బీజేపీ దివాళా కోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట అని హరీశ్ రావు అన్నారు. బీడీ కార్మికులకు కేంద్రం ఏం సాయం చేస్తుందో చర్చకు ఎక్కడైనా సిద్ధమే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు హరీష్ సవాల్ విసిరారు. రూ.1600 కాదు, పదహారు పైసలు కూడా కేంద్రం ఇవ్వడం లేదని తెలిపారు. రూ.1600 ఇస్తున్నట్లు రుజువు చేస్తే సిద్ధిపేట ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని అన్నారు. రుజువు చేయలేకపోతే కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ రాజీనామా చేయాలన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ కుటిల రాజకీయాలు చేస్తోందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.
Also read: కిస్తులు కట్టిన వారికి త్వరలో మోదీ సర్కార్ శుభవార్త!
Also read: మళ్ళీ వర్షగండం… భయపడొద్దన్న కేటీఆర్