గుంటూరు బాలుడి కిడ్నాప్ సుఖాంతం.. క్షేమంగా ఇంటికి చేరిన వినయ్.. డబ్బుల కోసం స్నేహితులతో కలిసి హైడ్రామా..!

| Edited By: Team Veegam

Nov 17, 2020 | 10:50 PM

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిన్న అదృశ్యమైన బాలుడు తుమ్మా వినయ్‌ క్షేమంగా ఇంటికి తిరిగివచ్చాడు. డబ్బు కోసం ఆ బాలుడే ఓ కట్టు కథ అల్లినట్లు పోలీసుల విచారణలో తేలింది.

గుంటూరు బాలుడి కిడ్నాప్ సుఖాంతం.. క్షేమంగా ఇంటికి చేరిన వినయ్.. డబ్బుల కోసం స్నేహితులతో కలిసి హైడ్రామా..!
Follow us on

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిన్న అదృశ్యమైన బాలుడు తుమ్మా వినయ్‌ క్షేమంగా ఇంటికి తిరిగివచ్చాడు. డబ్బు కోసం ఆ బాలుడే ఓ కట్టు కథ అల్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. సత్తెనపల్లికి చెందిన వెంకటేశ్వర్లు అనే వస్త్రవ్యాపారి కుమారుడు పన్నెండేళ్ల వినయ్‌ సోమవారం నుంచి కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.. అయితే, రాత్రి సమయంలో అపరిచిత వ్యక్తులు బాలుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. రూ.10 లక్షలు సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో వెంకటేశ్వర్లు కుటుంబం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది..

బాలుడి పేరెంట్స్‌ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసు స్పెషల్‌ టీమ్‌.. వినయ్‌ ఆచూకీ కోసం గాలించారు. సిసి ఫుటేజీని పరిశీలించారు. ఎక్కడిక్కడ పోలీసులను అలెర్ట్‌ చేశారు. చెక్‌పోస్టులో తనిఖీలు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. చిట్టచివరి బాలుడి అచూకీ గుర్తించారు. విచారణలో భాగంగా బాలుడి స్నేహితులు ఇచ్చిన సమాచారం పోలీసులు అవాక్కయ్యారు.

ఈ క్రమంలో పోలీసులు విచారణ చేపట్టి నరసరావుపేట రోడ్డులో వే బ్రిడ్జి వద్ద బాలుడిని గుర్తించారు. అనంతరం సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే, వినయ్‌ అదృశ్యం వెనుక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. డబ్బు కోసం స్నేహితుల సాయంతో బాలుడే కిడ్నాప్‌ డ్రామా ఆడినట్లు పోలీసులు గుర్తించారు. మున్నా గ్యాంగ్‌ పేరుతో తొలుత రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఆ తర్వాత రూ.50వేలు.. చివరకు రూ.10వేలు ఇవ్వాలని బేరం ఆడారు. తల్లిదండ్రులకు అనుమానం వచ్చి వినయ్‌ స్నేహితులను ఆరా తీయగా మిస్టరీ వీడింది.