జూలై 2021 నాటికి 25 కోట్ల మందికి వ్యాక్సిన్.. ముందుగా వారికే ప్రాధాన్యతః కేంద్రం

కరోనా వైరస్ కట్టడి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేశ ప్రజలకు కేంద్ర ఆరోగ్య మంత్రి శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాది జులై నాటికి 130 కోట్ల దేశ జనాభాలో 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ అందచేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఆదివారం వెల్లడించారు.

జూలై 2021 నాటికి 25 కోట్ల మందికి వ్యాక్సిన్.. ముందుగా వారికే ప్రాధాన్యతః కేంద్రం
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 04, 2020 | 5:32 PM

కరోనా వైరస్ కట్టడి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేశ ప్రజలకు కేంద్ర ఆరోగ్య మంత్రి శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాది జులై నాటికి 130 కోట్ల దేశ జనాభాలో 25 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ అందచేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఆదివారం వెల్లడించారు. భారత్‌లో పలు వ్యాక్సిన్‌లు కీలక దశ పరీక్షలు పూర్తి చేసుకోవడంతో ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు నిర్వహించి వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయన్న మంత్రి.. ప్రభుత్వం 40 నుంచి 50 కోట్ల వ్యాక్సిన్ డోసులను సేకరిస్తుందన్నారు. కొవిడ్ వ్యాక్సిన్‌ను అందరికీ సమంగా పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ఏయే వర్గాలకు ముందస్తు ప్రాధాన్యత ఇవ్వాలన్న దానిపై ఈ నెలాఖరులోగా జాబితాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరామన్నారు. వ్యాక్సిన్‌ సేకరణను కేంద్రకృతంగా చేపట్టి ప్రతి కన్‌సైన్‌మెంట్‌ను రియల్‌టైంలో ట్రాక్‌ చేస్తామని చెప్పారు.

ఇక, వ్యాక్సిన్‌ను ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు అందచేస్తామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ వైద్యులు, నర్సులు, పారామెడికల్‌, పారిశుద్ధ సిబ్బంది, ఆశా కార్యకర్తలతో పాటు వైరస్‌ ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీట్‌మెంట్‌ ప్రక్రియలో నిమగ్నమైన ఇతరులకు ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ను వేస్తామని ఆయన వివరించారు. వ్యాక్సిన్‌ సమంగా అందరికీ అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని, భారత వ్యాక్సిన్‌ తయారీదారులకు పూర్తి సహకారం అందిస్తుందని ఆయన వెల్లడించారు. మరోవైపు, దేశంలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. టీకా కోసం కోట్లాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటువంటి సమయంలో కేంద్ర మంత్రి ప్రకటన కొత్త ఉపిరిని తీసుకువచ్చిందంటున్నారు నిపుణులు.