
కోవిద్-19 మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ కట్టడికి వ్యాక్సీన్ కోసం చాలా దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. అయితే.. పొగ తాగేవారికి కరోనా త్వరగా సోకడంలేదట. పొగాకులోని నికోటిన్ కరోనా వైరస్ సోకకుండా వారిని కాపాడుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు ‘నికోటిన్ పాచెస్’ అనే కొత్త వైద్య విధానాన్ని ఫ్రాన్స్ శాస్త్రవేత్లలు అభివృద్ధి చేసినట్లు వారు తెలిపారు. అయితే ఈ విధానంపై క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతి రావలసి ఉందని చెప్పారు.
కాగా.. పొగాకు తాగేవారికి కరోనా త్వరగా సోకకపోయినప్పటికీ.. ఒకసారి వైరస్ సోకితే మాత్రం ఇతరులకంటే వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. పొగ తాగే వారి ఊపిరితిత్తుల్లో సాధారణంగానే విషపూరితమైన పదార్థం వృద్ధి చెంది ఉంటుందని, దీనివల్ల వారిని కరోనా తీవ్రంగా బాధిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
మరోవైపు.. ఫ్రెంచ్ న్యూరోబయాలజిస్ట్ జీన్-పెర్రీ చాంగియక్స్ మాట్లాడుతూ.. శరీరంలోకి ప్రవేశించిన కరోనా వైరస్ కణాలను దెబ్బతీయకుండా నికోటిన్ కాపాడే అవకాశం ఉందని, కొన్నిసార్లు వైరస్ సోకినప్పటికీ దాని లక్షణాలను నికోటిన్ బయటపడనివ్వదని వివరించారు. దీనివల్ల బాధితుల పరిస్థితి ప్రమాద స్థాయికి చేరేవరకు వారికి కరోనా సోకినట్లు గుర్తింలేకపోవచ్చని, వారిని కాపాడే అవకాశం కూడా సన్నగిల్లుతుందని ఆయన స్పష్టంచేశారు.