కోడలిపై అత్యాచారం చేసి, తుపాకీతో బెదిరించారనే ఆరోపణలపై ఢిల్లీకి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే మనోజ్ షోకీన్‌పై కేసు నమోదైంది. నూతన సంవత్సరం సందర్భంగా గతేడాది డిసెంబరు 31 అర్ధరాత్రి నిందితుడు ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మనోజ్ షోకీన్ ఢిల్లీలోని నంగ్లోయ్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు బీజేపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఘటన జరిగిన రోజు రాత్రి తన పుట్టింటి నుంచి భర్త, సోదరుడితో మెట్టినింటికి వెళ్లారు. తర్వాత భర్త స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లగా, ఇంతలో మద్యం సేవించిన తన మామ మనోజ్ షోకీన్ గదిలోకి వచ్చి బలవంతం చేశాడు. నిరాకరించడంతో తుపాకీ తీసి, సోదరుణ్ని చంపుతానని బెదిరించి అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తన సోదరుడి వివాహం కావాలనే ఉద్దేశంతో ఇన్నాళ్లు ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పలేదని వివరించింది. అంతేకాక అత్తమామలు తనను వేధించేవారని కూడా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.