Fire at Visakhapatnam Harbor : విశాఖ ఫిషింగ్ హార్బర్ ఔటర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లి తిరిగొస్తున్న ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. బోటులో మంటలు వ్యాపించడాన్ని గ్రహించిన అందులోని ఐదుగురు మత్స్యకారులు వెంటనే తేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ఉదయం కొందరు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారు వేట ముగించుకుని తిరిగి వస్తుండగా బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోటులో మంటలు కనిపిండంతో వారు పోర్టు ట్రస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సముద్రంలోకి దూకేశారు. సాగర తీరంలో ఉన్న స్థానిక యువకులు అక్కడకు చేరుకుని వారిని రక్షించారు.
పోర్టు సిబ్బంది ప్రమాదం బారినపడ్డ బోటు వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. దానిని ఒడ్డుకు చేర్చారు. దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. బోటు ఇంజన్ వేడెక్కడంతో మంటలు వ్యాపించి ఉండొచ్చని తెలిపారు.