
గుజరాత్ తీరంలో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర వాసులకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. బుధవారం జరిపిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. గుజరాత్‌లో ఉన్న తెలుగు మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ. 2 వేల చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అక్కడున్న సుమారు 6వేల మంది మత్స్యకారులకు ఈ డబ్బు అందచేయాలని సీఎం నిర్దేశించారు.
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుని, అక్కడ చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న తెలుగు వారికి రెండేసి వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం వీలైనంత త్వరగా అంద చేయాలని సూచించారు సీఎం. గుజరాత్‌లో తెలుగు మత్స్యకారుల అంశంపై సమీక్ష సమావేశంలో చర్చ జరిగింది. వారికి తగిన సదుపాయాలు, ఆహారం అందించాల్సిందిగా గుజరాత్ సీఎంకు ఫోన్ చేశానని సీఎం జగన్ తెలిపారు.
దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడామనని అధికారులు సీఎంకు వివరించారు. వసతి, భోజనం విషయంలో కొన్ని రకాల చర్యలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. గుజరాత్‌లో వుండిపోయిన తెలుగు వారి విషయంలో ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశాలిచ్చారు. వారికి తగిన వసతి, సదుపాయాలు అందేలా చూడాలంటూ సంబంధిత అధికారులకు సీఎం నిర్దేశించారు.