సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే భారీ మెజార్టీతో మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. సొంతంగా సంపూర్ణ మెజార్టీ రావడం వల్ల ఎటువంటి సంప్రదింపులు లేకుండా బడ్జెట్ పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. జూలై 5న ప్రవేశపెట్టే బడ్జెట్ సన్నాహాలను శనివారం నాడు ప్రారంభించారు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సందర్భంగా సంప్రదాయంగా వస్తున్న ఒరవడిని ఆమె కూడా చేపట్టారు.
గత కొంతకాలంగా బడ్జెట్ పనులు మొదలుపెట్టే ముందు అధికారులందరికీ ‘హల్వా’ వండి పెట్టడం ఓ అలవాటుగా మారింది. ఇక ఎన్డీయే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఆనవాయితీని క్రమం తప్పకుండా ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా హల్వాను పలువురికి వడ్డించారు. అటు ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఇందులో పాల్గొన్నారు.
ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, రెవెన్యూ కార్యదర్శి అజ్ భూషణ్ పాండే, దీపమ్ కార్యదర్శి అతను చక్రవర్తి, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక బడ్జెట్ తయారీలో పాలుపంచుకునే సిబ్బంది.. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగం ప్రారంభమయ్యే వరకు ప్రభుత్వ భవనంలోనే ఉంటారు. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది. ఈ హల్వా మాదిరిగానే పార్లమెంట్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ కూడా తీపిగా ఉంటుందా లేక చేదునే మిగిలిస్తుందా అనేది వేచి చూడాలి.