వాహనదారులూ బీ అలర్ట్.. ఫాస్టాగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారికే అనుమతి..
ఫాస్టాగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపు విధానానికి స్వస్తి చెప్పి పూర్తిస్థాయిలో ఫాస్టాగ్ విధానాన్ని..
ఫాస్టాగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపు విధానానికి స్వస్తి చెప్పి పూర్తిస్థాయిలో ఫాస్టాగ్ విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్న కేంద్రం.. అందుకు అనుగుణంగా ముందడగు వేసింది. ఇందులో భాగంగా ఫాస్టాగ్ ఉంటేనే వాహనాలను టోల్‌ప్లాజాలోకి అనుమతించాలని ఆదేశించింది. ఇకపై టోల్ ప్లాజాలో నగదు చెల్లింపులు ఉండబోమని స్పష్టమైన ప్రకటన చేసింది. అంతేకాదు ఈ విధానాన్ని జనవరి 1వ తేదీ నుంచి కచ్చితంగా అమలు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. కాగా, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని టోల్ ప్లాజాల వద్ద జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఫాస్టాగ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో వాహనదారులు ఫాస్టాగ్‌ను పొందవచ్చు అని తెలిపింది.
ఇదిలాఉండగా, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 18 టోల్ ప్లాజాలు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 17 టోల్ ప్లాజాలు ఉన్నాయి. అన్ని ప్లాజాల్లో ఒక లేన్‌ను నగదు చెల్లింపులకు కేటాయించి మిగతా లేన్లలో ఫాస్టాగ్ అమలు చేస్తున్నారు. అయితే, గత ఏడాది డిసెంబరు నుంచే అన్ని లేన్లనూ ఫాస్టాగ్‌కే కేటాయించాలని కేంద్రం భావించింది. కానీ, వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ణప్తి మేరకు ఫాస్టాగ్ లేన్లలో ఒక దానిని నగదు చెల్లింపులకు కేటాయించింది. ఇప్పుడు దాన్ని కూడా తీసేసి పూర్తిగా ఫాస్టాగ్ విధానాన్ని తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. వాహనదారులు ఇకనైనా అలర్ట్ అయి ఫాస్టాగ్ తీసేసుకోండి.. లేదంటే నో ఎంట్రీ బోర్డు దర్శనమిస్తుంది.