ఫేస్ బుక్ లీక్… నో సెక్యూరిటీ… 41.9 కోట్ల యూజర్ల ఫోన్ నంబర్లు హ్యాక్?

కేంబ్రిడ్జ్ ఎనలిటికా ఎపిసోడ్ ముగిసిన ఏడాదికే ఫేస్ బుక్ సంస్థ మరోసారి చిక్కుల్లో పడింది. వినియోగదారుల సమాచార భద్రత విషయంలో ఫేస్ బుక్ నిర్లక్ష్యవైఖరి ఎంతకీ మారడం లేదు. ఇప్పటికే ఎన్నో సార్లు యూజర్ల డేటా బయటకు వెళ్లినప్పటికీ సర్వర్లు, ఎన్ క్రిప్షన్ల విషయంలో ఏ మాత్రం జాగ్రత్త వహించడం లేదు. ఈ ఏడాదే 4.9 కోట్ల యూజర్ల ఇన్ స్టాగ్రామ్ పాస్ వర్డ్ లు బయటకు వెళ్లి ప్రపంచం ఉలిక్కిపడ్డ ఘటన మరిచిపోకముందే ఫేస్ బుక్ […]

ఫేస్ బుక్ లీక్... నో సెక్యూరిటీ... 41.9 కోట్ల యూజర్ల ఫోన్ నంబర్లు హ్యాక్?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 05, 2019 | 6:46 PM

కేంబ్రిడ్జ్ ఎనలిటికా ఎపిసోడ్ ముగిసిన ఏడాదికే ఫేస్ బుక్ సంస్థ మరోసారి చిక్కుల్లో పడింది. వినియోగదారుల సమాచార భద్రత విషయంలో ఫేస్ బుక్ నిర్లక్ష్యవైఖరి ఎంతకీ మారడం లేదు. ఇప్పటికే ఎన్నో సార్లు యూజర్ల డేటా బయటకు వెళ్లినప్పటికీ సర్వర్లు, ఎన్ క్రిప్షన్ల విషయంలో ఏ మాత్రం జాగ్రత్త వహించడం లేదు. ఈ ఏడాదే 4.9 కోట్ల యూజర్ల ఇన్ స్టాగ్రామ్ పాస్ వర్డ్ లు బయటకు వెళ్లి ప్రపంచం ఉలిక్కిపడ్డ ఘటన మరిచిపోకముందే ఫేస్ బుక్ లో మరో డేటా చోరీ జరిగింది. ఫేస్ బుక్ సర్వర్లలో ఎటువంటి ఎన్ క్రిప్షన్ లేకుండా ఉన్న ఒక డేటాబేస్ నుంచి సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. అందులో 419 మిలియన్లు అంటే 41.9 కోట్ల మంది యూజర్ల వివరాలు ఉన్నట్లు సమాచారం.

ఈ వివరాల్లో వారి పేర్లు, ఫేస్ బుక్ ప్రొఫైల్ వివరాలు, ఏయే దేశానికి చెందిన వారు, చివరికి వారి ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయని తెలిసింది. ఇందులో కొంతమంది సెలబ్రిటీల వివరాలు కూడా ఉన్నాయని వార్తలు రావడం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ లీకైన సమాచారం ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో అని టెక్ నిపుణులు ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే చాలా సార్లు ఇలాంటి డేటా లీక్ లు జరగడం ఇకపై జరగకుండా చూసుకుంటామని, భద్రత పెంచుతామని ఫేస్ బుక్ సర్దిచెప్పుకోవడం వంటి సంఘటనలు జరిగాయి. ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వినియోగదారులు ఫేస్ బుక్ మీద పూర్తిస్థాయిలో నమ్మకం నమ్మకం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

ఇప్పుడు లీకైన డేటాలో మొబైల్ నంబర్లు కూడా ఉండటంతో సిమ్ స్వాపింగ్ వంటి అక్రమ పద్ధతులతో మొబైల్ నంబర్ ని దుర్వినియోగం చేయడం, ఫోన్ నంబర్లకి స్పామ్ కాల్స్ చేయడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. పైన పేర్కొన్న డేటాతో పాటు ఫేస్ బుక్ ప్రతి అకౌంట్ కు ఇచ్చే ప్రత్యేక నంబర్లు కూడా ఈ సమాచారంతో బయటకు వచ్చాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. లీకైన సమాచారంలోని యూజర్లలో అమెరికాకు చెందిన వారు అత్యధికంగా 133 మిలియన్ల మంది(13.3 కోట్లు) ఉన్నట్లు తెలిసింది. మిగతా వారిలో ఇంగ్లండ్ కు చెందిన వారు 18 మిలియన్లు(1.8 కోట్లు), వియత్నాంకు చెందిన వారు 50 మిలియన్లు(5 కోట్లు) ఉన్నారని తెలిసింది.

డేటా లీక్ పై ఫేస్ బుక్ ప్రతినిధులు స్పందిస్తూ డేటా లీక్ జరిగినట్లు అంగీకరించారు. అయితే ఇందులో ఉన్న డేటా చాలా పాతదని, దానికి ఇప్పుడు చాలా మార్పులు జరిగినట్లు తెలిపింది. అంతేకాకుండా లీకైన డేటాలో చాలా వరకు డూప్లికేట్ డేటా ఉందని, బయటకు వచ్చిన వార్తల్లో ఉన్నంత డేటా లీకవ్వలేదని పేర్కొన్నారు. ఫేస్ బుక్ యూజర్లు భయపడక్కర్లేదని, ఫేస్ బుక్ ఖాతాలకు సంబంధించిన సమాచారం లీకైనట్లు ఎటువంటి సమాచారం లేదని ఫేస్ బుక్ పేర్కొంది. అయితే భారీ స్థాయిలో డేటా లీక్ జరిగిన మాట వాస్తవమేనని దానిని కప్పిపుచ్చుకునేందుకు ఫేస్ బుక్ యూజర్ల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తుందని పలువురు టెక్ నిపుణులు ఆరోపిస్తున్నారు.