కరోనా మహమ్మారి ధాటికి కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకునేందుకు వ్యాపారులు లావాదేవీలు షురూ చేశారు. మెల్ల మెల్లగా దుకాణాల పనివేళల్లో మార్పులు చేసుకుంటున్నారు. కరోనా వైరస్ పుణ్యమాన్ని వర్తక వాణిజ్యం పూర్తిగా తగ్గిపోయింది. వైరస్ భయానికి బయటకు వచ్చేందుకే జనం జంకుతున్నారు. దీంతో దుకాణాలు మూతపడ్డాయి. కాస్త కొవిడ్ విస్తరణ దగ్గడంతో తిరిగి ప్రారంభించేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గుంటూరులో దుకాణాల నిర్వహణకు సమయాన్ని జిల్లా యంత్రాంగం పొడిగించినట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. సోమవారం జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం పది నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాపారాలు సాగించవచ్చన్నారు. వ్యాపారులంతా తప్పనిసరిగా కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు. వ్యాపారాల నిర్వహణకు గడువు పొడిగించేందుకు సహకరించిన అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే వ్యవసాయ సంబంధిత దుకాణాలకు, హోటల్స్‌కు అనుమతిచ్చిన వేళల్లో ఎటువంటి మార్పు లేదన్నారు.