సుమారు మూడు కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లను స్టోర్ చేసేందుకు దేశంలో ఏర్పాట్లు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. రానున్న మరికొన్నివారాలు, నెలల్లోఅందుబాటులోకి రానున్న కోట్లాది డోసుల టీకాలమందులను స్టోర్ చేయడానికి ఉష్ణోగ్రతలను అదుపు చేయగల కంటెయినర్లు, జోన్ల ఏర్పాటుకు ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాల్లో సన్నాహాలు ప్రారంభమయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే ఈ ఎయిర్ పోర్టుల్లో ఆధునిక ఫార్మా వ్యాక్సిన్ స్టోరేజీ, ప్రాసెసింగ్ జోన్లు, ప్రత్యేక కూల్ ఛాంబర్లు ఉన్నాయి. ఇవి మైనస్ 20 డిగ్రీల ఉషోగ్రతతో కూడినవి. అలాగే ప్రత్యేక ట్రాలీలు సైతం ఉన్నాయి అని ఈ శాఖ వెల్లడించింది.
కరోనా వైరస్ తొలి రోజుల్లో ఈ రెండు విమానాశ్రయాల నుంచి కోట్లాది పీపీఈ కిట్లు, మందులు రవాణా అయ్యాయి. ఇక ఇండియాలో తమ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతించాలంటూ సీరం కంపెనీ, ఫైజర్, భారత్ బయో టెక్ సంస్థల అభ్యర్థనలను పరిశీలించేందుకు నిపుణులతో కూడిన కమిటీ ఒకటి బుధవారం సమావేశమవుతోంది. హైదరాబాద్ లోని భారత్ బయో టెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్ ని, పూణే లోని సీరం కంపెనీ ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీల సహకారంతో కోవిషీల్డ్ టీకామందును ఉత్పత్తి చేస్తున్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ ని మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ లో ఉంచాల్సి ఉంటుంది. హాస్పిటల్స్ లోని రిఫ్రిజిరేషన్ యూనిట్లలో దీన్ని 5 రోజులపాటు నిల్వ ఉంచవచ్చు.