ప్రజా పాలనపై దృష్టి సారించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ సర్కార్ గ్రామీణ సచివాలయాలను పటిష్టం చేస్తున్నారు. గ్రామ సచివాలయల్లో ఖాళీలగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం జగన్. ఇందులో భాగంగా విశాఖ జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి 26వ తేదీ వరకు రాత పరీక్షలు నిర్వహించనున్నట్టు విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశమందిరంలో పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతుండడంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
పరీక్షల నిర్వహణకు జిల్లాలో ఎనిమిది క్లస్టర్లగా విభజించి 330 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు కలెక్టర్. వారం రోజులపాటు జరిగే పరీక్షలకు జిల్లా నుంచి 1.5 లక్షల మంది హాజరవుతున్నారని తెలిపారు. పరీక్షలకు కావల్సిన ట్రంకు బాక్సులు, ఇతర సామగ్రి వెంటనే సమకూర్చుకోవాలన్నారు. వచ్చే నెల ఒకటో తేదీకల్లా పరీక్షల నిర్వహణకు అవసరమైన సామగ్రి తెప్పించుకోవాలన్నారు. స్ట్రాంగ్‌రూమ్ లేఅవుట్ తీసుకోవాలని, సామగ్రి పంపిణీలో గందరగోళం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు కలెక్టర్ వినయ్‌చంద్. శాటిలైట్ స్ట్రాంగ్ రూమ్‌లకు వచ్చే నెల 18న కల్లా సామగ్రి పంపించాలని సంంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణలో పాలుపంచుకునే శాఖలన్నింటినీ సమన్వయం చేసుకోవాలన్నారు.