సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఈడీ అధికారులు 10 గంటలకు పైగా విచారించారు. ఈ కేసుపై తాను సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినందున ఇంటరాగేషన్ ని వాయిదా వేయాలన్న రియా అభ్యర్థనను వారు తిరస్కరించారు. ఈ కేసులో రియాతో బాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని, మాజీ మేనేజర్ శృతి మోడీని కూడా ఈడీ విచారించింది. ముంబైలోని తమ కార్యాలయాల్లో వేర్వేరు గదుల్లో వీరిని ప్రశ్నించడం విశేషం.
సుశాంత్ కి చెందిన నాలుగు బ్యాంకు ఖాతాల్లో రెండింటి నుంచి రియా అకౌంట్ కి సుమారు 15 కోట్ల ట్రాన్స్ ఫర్ జరిగినట్టు భావిస్తున్నారు. అయితే ఏ కపుల్ అయినా రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఇలా లావాదేవీలు జరగడం సాధారణ విషయమేనని, పైగా వారిద్దరూ కలిసి జీవించారని, హాలిడే వెకేషన్స్ కి వెళ్లారని రియా సన్నిహిత వర్గాలు తెలిపాయి. రియా కుటుంబ సభ్యులతో బాటు సుశాంత్ ఓ కంపెనీని కూడా లాంచ్ చేశాడని ఈ వర్గాలు పేర్కొన్నాయి.
అంతా నా డబ్బులే..రియా వివరణ:
సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి రూ. 15 కోట్లను తన బ్యాంకు అకౌంట్ లోకి మళ్లించుకున్నట్టు వచ్చిన ఆరోపణలను రియా చక్రవర్తి తోసిపుచ్చింది. అసలు తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని ఈడీకి తెలిపింది. తాను, తన సోదరుడు షోవిక్, సుశాంత్ కి సంబంధించి కేవలం లక్ష రూపాయలు మాత్రమే పెయిడ్ అప్ కేపిటల్ అని, మిగతా సొమ్మంతా తన కష్టార్జితమేనని ఆమె తెలిపింది. నా పేరిట ఉన్నఫ్లాట్ కోసం నేను 60 లక్షలు హోసింగ్ లోన్ తీసుకున్నా.. మిగతా 25 లక్షలు నా సొంత ఆదాయానికి సంబంధించినదే అని రియా వాంగ్మూలమిచ్చింది. కాగా… రియా తండ్రిని కూడా ఈడీ అధికారులు విచారించారు.