మాస్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ స్పెషల్ స్థానం సంపాదించుకున్నారు పూరీ జగన్నాథ్. ఎలాంటి హీరో అయినా.. పూరీ సినిమాలో డిఫెరెంట్‌గా కనిపించాల్సిందే. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన పూరీ.. ‘ఇస్మార్ట్ శంకర్-2’కి కూడా కథను రెడీ చేసుకుంటున్నారు. అయితే.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేయాలని ఈ డైరెక్టర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.
అయితే ఇప్పుడు చిరు, పూరీల కాంబోలో ఓ సినిమా ప్రారంభం కానుందనే వార్తలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉన్నారు. అవి పూర్తయిన తర్వాత పూరీతో మెగాస్టార్ సినిమా ఉండబోతోందని ఓ టాక్ నడుస్తోంది. ఈ విషయంపై తాజాగా మాట్లాడిన డైరెక్టర్ పూరీ.. తనకు చిరుతో పనిచేసే అవకాశం నాలుగు సార్లు వచ్చినట్టే వచ్చి.. చేజారిపోయిందని, రెండు సార్లు పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత కూడా ఆగిపోయాయని తెలిపారు. ఎప్పటికైనా ఆయనతో ఓ సినిమా చేయాలన్నది నా కలని ఆయన పేర్కొన్నారు.
నిజానికి మెగాస్టార్ రీఎంట్రీ పూరీతోనే స్టార్ట్ కావాల్సి ఉంది. అలాగే అధికారికంగా ‘ఆటో జానీ’ అని ప్రకటన కూడా చేశారు నిర్మాత రామ్ చరణ్. అయితే కొన్ని కారణాలతో దాన్ని పక్కన పెట్టేసి.. ‘కత్తి’ సినిమాని రీమేక్ చేశారు. చూడాలి మరి.. ఇప్పటికైనా పూరీ కల నెరవేరుతోందో లేదో తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు.