DC vs RCB : ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారు కావాలంటే గెలవాల్సింది ఇలా..

|

Nov 02, 2020 | 6:50 PM

ఐపీఎల్ -13 సీజన్ మెగా క్రికెట్‌ లీగ్‌ కీలక దశకు చేరుకుంది. లీగ్‌ దశలో ఇంకా రెండు మ్యాచ్‌లే మిగిలి ఉండడంతో ప్లేఆఫ్స్‌ చేరుకునే జట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  మరికాసేపట్లో ఢిల్లీ, బెంగళూరు తలపడుతుండగా, మంగళవారం ముంబయి, హైదరాబాద్‌ పోటీపడుతున్నాయి...

DC vs RCB : ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారు కావాలంటే గెలవాల్సింది ఇలా..
Follow us on

DC vs RCB :  ఐపీఎల్ -13 సీజన్ మెగా క్రికెట్‌ లీగ్‌ కీలక దశకు చేరుకుంది. లీగ్‌ దశలో ఇంకా రెండు మ్యాచ్‌లే మిగిలి ఉండడంతో ప్లేఆఫ్స్‌ చేరుకునే జట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  మరికాసేపట్లో ఢిల్లీ, బెంగళూరు తలపడుతుండగా, మంగళవారం ముంబయి, హైదరాబాద్‌ పోటీపడుతున్నాయి. ఇప్పటికే ముంబై ప్లేఆఫ్స్‌ బెర్తు ఖరారు చేసుకోవడంతో పైన పేర్కొన్న మూడు జట్లతో పాటు ప్రస్తుతం నాలుగో స్థానంలో కొనసాగుతున్న కోల్‌కతా కూడా రేసులో ఉంది.

సీజన్‌ తొలి సగంలో అదరగొట్టిన బెంగళూరు, ఢిల్లీ ఆ తర్వాత ఓటమిపాలయ్యాయి. ఒక్క మ్యాచ్‌ గెలిస్తే ప్లేఆఫ్స్‌లో చేరుతాయని భావిస్తుండగా ఇరు జట్లూ గత మూడు, నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా ఓటమిని మూటగట్టుకుంటున్నాయి.

ఢిల్లీని బెంగళూరు ఓడిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఓడితే ఈ సీజన్‌ నుంచి తప్పుకునే పరిస్థితి నెలకొంది. లేదా రన్‌రేట్‌ పరంగా అర్హత సాధించే ఛాన్స్ కూడా ఉంది. అది కూడా కోల్‌కతా కన్నా మెరుగైన రన్‌రేట్‌తోనే ఢిల్లీ చేతిలో ఓటమిపాలవ్వాలి. కోహ్లీసేన 21 పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఓడిపోకూడదు.

ఒకవేళ ముందే బ్యాటింగ్‌ చేసినా ఛేదనలో ఢిల్లీని 14 బంతుల కంటే ముందు లక్ష్యాన్ని చేరుకోనివ్వకూడదు. పరిస్థితి మరీ చేయిదాటిపోయి ఓడిపోయినా బెంగళూరుకు ఓ అవకాశం ఉంది. అది కూడా ముంబై చేతిలో హైదరాబాద్‌ ఓడిపోతేనే. ఎందుకంటే ఇప్పుడు ప్లేఆఫ్స్‌ రేసులో పోటీపడుతున్న జట్లలో వార్నర్‌ టీమ్‌ ఒక్కటే పాజిటివ్‌ రన్‌రేట్‌తో కొనసాగుతోంది.

గత నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన ఢిల్లీ మరికాసేట్లో బెంగళూరును ఓడిస్తే నేరుగా రెండో స్థానానికి చేరుతుంది. ఒకవేళ ఓడితే ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారడమే కాకుండా టోర్నీ నుంచి వైదొలిగే ప్రమాదముంది. దురదృష్టం కొద్దీ ఓడినా 17 పరుగుల తేడాకు మించరాదు. ఒకవేళ తొలుత బ్యాటింగ్‌ చేస్తే ఛేదనలో బెంగళూరును 11 బంతుల కన్నా ముందే లక్ష్యాన్ని చేరుకోనివ్వకూడదు. మరోవైపు ముంబయి చేతిలో హైదరాబాద్‌ ఓటమిపాలైనా బెంగళూరు, ఢిల్లీ జట్లు నేరుగా ప్లేఆఫ్స్‌ చేరుకుంటాయి.