
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పొలానికి నీళ్లు వదలడానికి నిరాకరించినందుకు ఓ దళిత రైతుని చితకబాది చివరికి తల నరికేశారు. యూపీలోని షేక్‌పూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి కుమారుడు చెప్పిన కథనం ప్రకారం సోమవారం రాత్రి పొలంలో మృతుడు తన కుమారుడితో కలిసి పనులు చేసుకుంటున్నారు. కుమారుడిని ఇంటికి వెళ్లి భోజనం సిద్ధం చేయమని చెప్పి పంపించాడు. తండ్రి చెప్పగానే అతను ఇంటికి వెళ్లి పోయాడు. ఉదయం వరకు తండ్రి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి పొలానికి వెళ్లి చూడగా.. తండ్రి శవమై కనిపించాడని అతని కుమారుడు తెలిపాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే, పక్క పొలం రైతు తన పొలానికి నీళ్లు వదలమని అడిగాడని కానీ మృతుడు నిరాకరించడంతో అతడిని చితకబాదినట్లు గ్రామస్తులు తెలిపారు. అంతటితో అగకుండా నరికి చంపారని వెల్లడించారు. తాము అడ్డుకోబోతే అడ్డొచ్చిన వారిని చంపుతానని నిందితుడు బెదిరించాడని వారు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న నిందుతుడిని అరెస్టు చేసి అతనిపై హత్యా నేరంతోపాటు దళిత అట్రాసిటీ కేసు నమోదు చేశామని పోలీసలు తెలిపారు.