ఫొని తుఫాను ఒడిశాను అతలాకుతలం చేసింది. పుణ్యక్షేత్ర పట్టణం పూరీ అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉంది. అక్కడ వందల చెట్లు కూలిపోయాయి. సముద్ర తీర ప్రాంతంలో ఉండే మెరైన్ డ్రైవ్ రోడ్డు వెంట ఉండే చెట్లన్నీ కూలిపోయి… ఆ ప్రాంతం మొత్తం అస్థవ్యస్తంగా తయారైంది. సముద్ర అలలైతే… ఏకంగా మెరైన్ డ్రైవ్ రోడ్డు వరకూ వచ్చేశాయి. కొన్నిసార్లు రోడ్డును దాటి కూడా వచ్చాయి. ఇప్పుడక్కడ రోడ్డు కనిపించట్లేదు. దానిపై పేరుకున్న ఇసుకే కనిపిస్తోంది. ఈ తుఫాను వల్ల ఒడిశాలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది ఇళ్లు నాశనమై రోడ్డున పడ్డారు. 5వేల గ్రామాలు, 50 పట్టణాల్లో కరెంటు స్తంభాలు, మొబైల్ టవర్లూ కూలిపోయాయి. ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. అక్కడ నిన్నటి నుంచీ కరెంటు లేదు.
ప్రస్తుతం ఫొని తుఫాను.. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో… ఉత్తరం వైపు కదులుతూ… ఈశాన్యం వైపుగా వెళ్తోంది. వచ్చే 6 గంటల్లో అది పశ్చిమ బెంగాల్‌లో మరోసారి తీరం దాటబోతోంది. ఆ సమయంలో గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయనీ… పరిస్థితి తలకిందులైతే… గంటకు 105 కిలోమీటర్ల వేగంతో కూడా వీచే ప్రమాదం ఉందంటున్నారు. వెస్ట్ బెంగాల్‌లోని మిడ్నపూర్, దిఘా, కోల్‌కతాపై ఎక్కువ ప్రభావం చూపేలా ఉందంటున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోల్‌కతా, భువనేశ్వర్‌లో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఒడిశాలోని పారాదీప్, గోపాల్‌పూర్ ఓడ రేవుల్ని క్లోజ్ చేశారు. కోల్‌కతాలోని హల్దియా ఓడరేవును కూడా మూసేశారు.
హౌరా-చెన్నై మార్గంలోని 220 రైళ్లను రద్దు చేశారు. ఢిల్లీ నుంచీ భువనేశ్వర్ వెళ్లాల్సిన 10 విమానాలు, కోల్‌కతా వెళ్లాల్సిన 15 విమాన సర్వీసులు రద్దయ్యాయి. భువనేశ్వర్ నుంచీ వెళ్లే 9 విమానాల్ని కూడా ఆపేశారు. కోల్‌కతా నుంచీ బయలుదేరాల్సిన 5 విమానాలు కూడా అక్కడే ఆగిపోయాయి. శుక్రవారం 3 గంటల నుంచీ శనివారం 8 గంటల వరకూ కోల్‌కతా విమానాశ్రయం నుంచీ ఒక్క విమానం కూడా ఎగరదని అధికారులు తెలిపారు. సరిగ్గా ఆ టైంలో తుఫాను దాడి చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. కోల్‌కతాలో స్కూళ్లకు సెలవిచ్చారు. ప్రజలు కూడా మధ్యాహ్నం కల్లా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోవాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. పశ్చిమ మిడ్నపూర్, నార్త్, సౌత్ 24 పరగణాలు, హౌరా, జార్‌గ్రామ్, కోల్‌కతా, సుందర్బన్ అడవులపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 48 గంటలపాటూ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.