అస్సలు మార్పు లేదు..అదే నిర్లక్ష్యం..అంతే లెక్కలేనితనం. కరోనా వైరస్ వచ్చిన వ్యక్తికే కాదు ప్రమాదం. అతడి పక్కన ఉన్నవారికి కూడా. అయినా కానీ కొందరు వైరస్ ను లెక్కలోకి తీసుకోవడం లేదు. లెక్కకు మించి అతి చేస్తున్నారు. తాజాగా ఓ కరోనా రోగి పాన్ మసాలా కోసం ఆస్పత్రి నుంచి ఎస్కేప్ అయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే..ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో నివశించే 35 ఏళ్ల ఓ వ్యక్తికి కొద్ది రోజుల కిందట కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. దీంతో అతడిని స్థానిక ఎస్‌ఎన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఉంచి ట్రీట్మెంట్ అందించారు. ఆ తర్వాత అతడిని కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకి తరలించారు. ఆ వ్యక్తికి పాన్ మసాలా తినడం వ్యవసంలా మారింది. ఐసోలేషన్ సెంటర్ లో అలాంటి ఆనవాళ్లు కూడా దొరకవు. కొంత మంది సిబ్బంది తెచ్చిపెడతారేమో అని ట్రై చేశాడు. కానీ ఉపయోగం లేదు. దీంతో ఉండబట్టలేక ఆస్పత్రి నుంచి జంప్ అయ్యాడు. లాక్ డౌన్ అమలవుతుండటంతో..ఆగ్రాలో ఎక్కడా షాపులు తెరిచిలేవు. దీంతో గాంధీ నగర్ వెళ్లాడు. అక్కడ ఓ షాప్ తెరిచి ఉండటంతో పాన్ మసాలా తిని, మరికొన్ని పాన్‌లను పార్శిల్ చేయించుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి తన ఫ్రెండ్ బంధువు ఇంటికి వెళ్లి..తన కరోనా సోకిన విషయాన్ని తెలిపాడు. ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించమని వారిని కోరాడు. ఆ వార్త విని వారి గుండెళ్లో రైళ్లు పరిగెట్టాయి. అధికారులు అక్కడికి చేరకుని తిరిగి అతడిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. రోగి స్నేహితుడి బంధువు కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.