సుప్రీంకోర్టు తీర్పు తరువాతైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మార్పు వచ్చి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరిస్తారని అందరూ భావించారని అయితే, అలాంటి పరిస్థితి కనిపించడంలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. బాధ్యతాయుత స్థానంలో ఉన్న రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఎన్నికల కమిషన్ను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి వాయిస్ గా పేరుగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఎస్ఈసీ ని కించపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏకగ్రీవాలపై ప్రకటనలు ఎందుకు ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా దౌర్జన్యంగా ఏకగ్రీవాలు చేసుకునే పక్షంలో అసలు ఎన్నికలు ఎందుకు? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్న వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీకి ప్రభుత్వం సిద్ధం కావటం ఎన్నికల కోడ్ కు విరుద్ధమని ఆయన అన్నారు.