కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్థ కీలక ప్రకటన చేసింది. తమ ప్రయోగాత్మక కోవిడ్-19 టీకా కరోనాను నిరోధించే యాంటీ బాడీస్ ఉత్పత్తి చేసిందని ప్రకటించింది. కొద్దిపాటి స్థాయిలో నిర్వహించిన ప్రారంభ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రకారం తమ వ్యాక్సిన్ సురక్షితంగా కనిపిస్తోందని తెలిపింది.
యూఎస్ లోని మేరీల్యాండ్‌కు చెందిన బయోటెక్నాలజీ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. తమ వ్యాక్సిన్ ఎన్‌విఎక్స్-కోవి 2373, ఆరోగ్యకరమైన వాలంటీర్లలో రెండు మోతాదుల తర్వాత ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని, అత్యధికంగా యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యాయని పేర్కొంది. ఈ ఫలితాల ఆధారంగా తమ వ్యాక్సిన్ విజయం సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచేలా అదనంగా అందించిన మ్యాట్రిక్స్ ఎమ్ పదార్ధం, టీకా ప్రభావాన్నిమరింత పెంచుతుందని అధ్యయనంలో తేలిందని తెలిపింది.
కాగా.. యూఎస్ సహా పలుదేశాల్లో రెండోదశ ట్రయల్స్ నిర్వహిస్తామని తెలిపింది. త్వరలోనే చివరి దశ క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రారంభిస్తామని నోవావాక్స్ రీసెర్చ్ చీఫ్ గ్రెగొరీ గ్లెన్ తెలిపారు. డిసెంబరు నాటికి రెగ్యులేటరీ ఆమోదం పొందాలని ప్రయత్నిస్తున్నామన్నారు. జనవరి 2021 నాటికి 1 నుంచి 2 బిలియన్ల మోతాదులను అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
Read More: