Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ విధానంతో దేశప్రజలందరికీ కరోనా టెస్టులు!

ఇల్లిల్లు తిరక్కుండానే దేశ ప్రజలందరి నమూనాలను సేకరించి, కరోనా పరీక్షలు నిర్వహించే ప్రతిపాదన ఒకటి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తోంది. ఈ విధానాన్ని ప్రతిపాదిస్తున్న సంస్థ ప్రస్తుతం కోల్ కతా, బెంగళూరు వంటి నగరాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తోంది. దాని ఫలితాల ఆధారంగా కేంద్రం ముందుకు ఈ ప్రతిపాదన వచ్చే అవకాశం వుంది.

ఆ విధానంతో దేశప్రజలందరికీ కరోనా టెస్టులు!
Follow us
Rajesh Sharma

|

Updated on: Apr 28, 2020 | 4:53 PM

కరోనా వైరస్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ముందు ఓపెన్ టాస్క్‌ని తీసుకు వస్తున్నారు నిపుణులు. 135 కోట్ల మంది భారతీయులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది? ఇంత పెద్ద దేశంలో ఇలాంటి టాస్క్ సాధ్యమవుతుందా? ఇలాంటి సందేహాలకు తమదైన శైలిలో కొత్త మార్గాన్ని అన్వేషిస్తున్నారు నిపుణులు.

కోవిడాక్షన్ కొలాబ్ అనే సంస్థ రూపొందించిన విధానంలో యావత్ దేశ ప్రజలందరికీ కరోనా పరీక్షలను పరోక్ష పద్దతిలో నిర్వహించడం ద్వారా వైరస్ ప్రబలుతున్న ప్రాంతాలను తేలికగా గుర్తించవచ్చన్నది ఈ సంస్థ ప్రతిపాదన. కోవిడాక్షన్ కొలాబ్ (సీఏసీ) సంస్థ ప్రతినిధులు ప్రస్తుతం తాము రూపొందించిన విధానాన్ని బెంగళూరు, కోల్ కతా వంటి జనసాంద్రత అధికంగా వున్న నగరాలలో ప్రయోగాత్మకంగా వినియోగిస్తోంది. దాని ఫలితాల ఆధారంగా కేంద్రం ముందుకు ఈ విధానాన్ని తీసుకువెళ్ళాలని యోచిస్తోంది.

ఈవిధానంలో కరోనా వైరస్ రోగులు వున్న ప్రాంతాల మురుగుకాల్వల నుంచి నమూనాలను సేకరిస్తారు. కరోనా వైరస్ వ్యాది ప్రబలిన వ్యక్తులు ఆ ఏరియాల్లో వుంటే వారి మలమూత్రాల్లో వైరస్ తాలూకా లక్షణాలు తెలిసిపోతాయని సీఏసీ ప్రతినిధులు భావిస్తున్నారు. నమూనాలలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే ఆ ఏరియాపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి సారించి, ఆ ఏరియాల్లో వున్న వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించడం ద్వారా వైరస్ ప్రబలకుండా సుదీర్ఘ కాలం తమ ప్రయత్నాలను కొనసాగించవచ్చని సీఏసీ సంస్థ ప్రతినిధి అంజెలా చౌధురీ అంటున్నారు.

కరోనా వైరస్ ప్రభావం ఇప్పట్లో తొలగే అవకాశం లేకపోవడంతో తాము సూచిస్తున్న విధానంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించడం తేలిక అవుతుందని సీఏసీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. సీఏసీ ఈ సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాటలిస్ట్ గ్రూప్ హెల్త్ భాగస్వామి చౌదరి తాము రూపొందించిన విధానాన్ని మీడియాకు తెలియజేశారు.

చౌదరి కథనం ప్రకారం సీఏసీ సంస్థ కరోనా పరీక్షల కోసం నమూనాలను సేకరించేందుకు ఈ విధానాన్ని రూపొందించింది. ఈ విధానం ప్రకారం తాము ఎంచుకున్న కాలనీల్లో మురుగు కాలువల నుంచి నమూనాలు సేకరిస్తారు. వాటిని పరీక్షించడం ద్వారా ఆ నివాస ప్రాంతాలలో ఈ మేరకు కరుణ వైరస్ ప్రబలింది అన్న విషయాన్ని గుర్తిస్తారు. దానికి అనుగుణంగా చర్యలు చేపడతారు.

ఈ విధానాన్ని అనుసరిస్తే దేశంలో ఉన్న 135 కోట్ల మంది ప్రజల నమూనాలను పరీక్షించడం వీలవుతుందని సీఏసీ సంస్థ చెబుతోంది. ప్రతీ ఇంటికీ తిరిగి.. ప్రతి ఒక్కరికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడం.. వాటి నివేదికలు వచ్చేదాకా వేచి చూడడం కంటే మురుగు కాల్వల నుంచి సేకరించిన నమూనాల ద్వారా వైరస్ ప్రబలిన ప్రాంతాలను గుర్తించి దానికి అనుగుణంగా చర్యలు చేపట్టడం వల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు సాధించవచ్చని సీఏసీ సంస్థ చెబుతోంది. తాము రూపొందించిన ఈ విధానాన్ని ముందుగా కోల్‌కతా, బెంగళూర్ నగరాల్లోని అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ప్రయోగించి చూస్తామని దాని ఫలితాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ముందు తమ ప్రతిపాదనను ఉంచుతామని సంస్థ తెలిపింది.