చైనా వుహాన్‌లో పుట్టిన కోవిడ్-19 ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక్క అంటార్కిటికా మినహా 6 ఖండాలను వణికిస్తోంది. దాదాపు 70 దేశాలకు పాకిన ఈ వైరస్ వేలమందిని బలితీసుకుంది. కరోనా భయంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. అంతకంతకూ వైరస్ విజృంభిస్తుండటంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వైరస్ బారిన పడ్డ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై బ్యాన్ విధించాయి. ఆయా దేశాల విమానాలను కూడా రద్దు చేశాయి.
ఇప్పుడీ ప్రాణాంతక మహమ్మారి కరోనా ప్రభావం హజ్ యాత్రపైనా పడింది. మక్కా మసీదు సందర్శనను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది సౌదీ అరేబియా. ఏటా లక్షల మంది యాత్రికులను ఆకర్షించే సౌదీ అరేబియా విదేశీ పర్యాటకుల వీసాలను రద్దు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణతో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే తమ దేశం వచ్చిన విదేశీయులను తగిన వైద్య పరీక్షల అనంతరం మక్కా సందర్శనకు అనుమతిస్తామని…కోవిడ్ ఉన్న దేశాల యాత్రికులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని సౌదీ విదేశాంగశాఖ స్పష్టం చేసింది.
మదీనా నుండి మక్కా వరకు సాగే ఈ హజ్ యాత్రను ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముస్లింగా పుట్టినందుకు ఒక్కసారైనా తప్పనిసరిగా హజ్ యాత్ర చేయాలనుకుంటారు. మక్కా మసీదు సందర్శనకు ఏటా ప్రపంచ దేశాలనుండి కొన్ని లక్షలమంది తరలివస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున యాత్రికులు హజ్ యాత్రకు వెళ్తుంటారు. హజ్ యాత్రకు వెళ్లే పేద ముస్లింలకు ప్రభుత్వాలు కూడా రాయితీలు ప్రకటిస్తుంటాయి. ఇప్పటికే హజ్ యాత్రకు టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు ముస్లింలు. కానీ వారి ఆశలపై కరోనా వైరస్ నీళ్లు చల్లింది.
సౌదీ అరేబియా నిర్ణయంతో హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులు తమ టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నాయి ట్రావెల్ ఏజెన్సీలు. దాదాపు 5 నుంచి 6వేల మందిపై ప్రభావం పడుతోందని..టికెట్ క్యాన్సిల్ చేసుకున్న వారికి మనీ రిఫండ్ చేయడం జరుగుతుందన్నారు. మార్చి 13,14 తేదీల్లో విమానాలు కొనసాగించే అవకాశముందంటున్నారు.
ఎంతో అదృష్టంగా భావించే ఈ యాత్రలో ఒక్కసారిగా సౌదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముస్లింలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు ఉద్యోగాల రీత్యా గల్ఫ్ దేశాల్లో ఉంటూ భారత్‌కు వచ్చిన వారు కూడా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. లీవ్‌లో వచ్చి ఇక్కడి నుంచి సౌదీ వెళ్లడానికి మెడికల్ సర్టిఫికెట్ కంపల్సరీ అనే నిబంధనలతో ఇళ్లకు రావడానికి కూడా ఆందోళన చెందుతున్నారు. చరిత్రలో ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని అంటున్నారు.
మొత్తానికి చైనాలో ప్రారంభమైన కోవిడ్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది. ఇప్పుడీ మహమ్మారి హజ్ యాత్రపైనా ప్రభావం చూపుతుండటంతో ముస్లింలంతా నిరుత్సాహానికి గురవుతున్నారు. ఐతే మక్కా సందర్శనపై ప్రస్తుతం విధించిన నిషేధాన్ని జూలై నాటికి ఎత్తివేస్తారా..కొనసాగిస్తారా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది.