Crop loan weaving off guidelines: తెలంగాణలో మార్చి నెల నుంచే రైతు రుణమాఫీ ప్రారంభమవుతుందని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చేసిన మాటలను నిలబెట్టుకున్నారు. రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం పూర్తి నిబంధనలను మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి మార్గదర్శకాల ఉత్తర్వులను విడుదల చేశారు.
రైతు రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు జీవో జారీ చేశారు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి. ఒక లక్ష రూపాయల లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2014 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 11, 2018 తేదీల మధ్య లోన్ తీసుకొని ఉంటేనే రుణమాఫీకి అర్హులు అవుతారు. బ్యాంకు బ్రాంచ్, గ్రామాల వారీగా డిసెంబర్ 11 లోపు తీసుకున్న క్రాప్ లోన్ల లిస్ట్‌ను వ్యవసాయ శాఖ అధికారులు సిద్దం చేస్తున్నారు.
పట్టణాలు, మెట్రో పాలిటిన్ సిటీ (హైదరాబాద్)లో తీసుకున్న లోన్లు రుణమాఫీకి వర్తించవని స్పష్టంగా పేర్కొన్నారు ఉత్తర్వుల్లో. కుటుంబంలో ఎంత మంది పేరు మీద క్రాప్ లోన్ ఉన్నా.. ఒక్కరి రుణం మాత్రమే మాఫీ అవుతుంది. అది కూడా లక్ష రూపాయల వరకే ఇది వర్తిస్తుంది. తొలి దశలో భాగంగా మార్చి నెలాఖరుకు 25 వేల రూపాయలలోపు ఉన్న రుణాలు మాఫీ చేయనున్నారు.