తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. ఏపీలో మాత్రం ఆర్టీసీ ఉద్యోగులు పండుగ చేసుకుంటున్నారు. అసలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం ఏపీలోనే మొదలైంది. ఆ రాష్ట్రంలో జగన్ అధికారంలోకి రాకముందు.. ఆర్టీసీ కార్మికులు తమను ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఎన్నో పోరాటాలు చేశారు. దీంతో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారు. అయితే గత కొన్నేళ్లుగా చూసుకుంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ నష్టాల్లో ఉంది. 2018-2019 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా రూ.928.67 కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నట్లు ప్రభుత్వానికి టీఎస్ ఆర్టీసీ నివేదించింది. ఏపీలో రూ.6445 కోట్ల నష్టాలతో ఉన్నప్పటికీ.. జగన్ ప్రభుత్వం దానిని పట్టించుకోకుండా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఆ సంస్థ ఉద్యోగుల పట్ల ఉదారంగా వ్యవహరించారు. ఆర్టీసీ విలీనం పై రవాణా శాఖ ఇచ్చిన సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న జగన్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. దసరా కానుకగా వారి రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ ప్రధాన నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక ఏపీలో లాగే తెలంగాణలో కూడా కూడా ఆర్టీసీ ఉద్యోగులు తమను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు.. తమ జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం వారి డిమాండ్‌ను పట్టించుకోకపోవడంతో.. సమ్మెకు దిగారు.
దసరా లాంటి పెద్ద పండుగల సీజన్లలో.. నగర వాసులకు ఇబ్బంది కలిగేలా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగడం నిబంధనలకు విరుద్దమని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. ప్రభ్వుత్వం ఇచ్చిన గడువులోగా.. అనగా ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించుకోవాలన్నారు. లేనిచో ఎస్మా చట్టాన్ని(అత్యవసర సర్వీసుల చట్టం) ప్రయోగించి సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇటీవల కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో.. ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసు పై మంత్రివర్గ సభ్యులు విసృతంగా చర్చించారు. ఏపీ ప్రభుత్వం అక్కడి ఆర్టీసీ ఉద్యోగులకు అందించిన “నజరానా” ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం లేదని.. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని విలీనం చేసిన పక్షంలో ఎదురయ్యే పరిణామాలపై సమీక్షించాల్సి ఉందని ఆ సమావేశంలో అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టే కేసీఆర్ వ్యూహమేంటో స్పష్టమవుతోంది. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి.. వారితో సానులంగా చర్చలు జరిపారు. ఇక రెండోసారి కూడా అదే ప్రయత్నం చేశారు కాని.. ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగారు.