దేవుడి ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయ్యానని పదేపదే చెప్పుకుంటున్న కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రస్తుతం క్లిష్టమైన సమస్యలతో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం కూలిపోనుందనే చర్చలు జోరుగా సాగుతుండటం, మండ్య నుంచి పోటీ చేసిన కుమారుడు నిఖిల్ గెలుపు అంతసులువు కాదనే ప్రచారాల తరుణంలో ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రశాంతతో పాటు అన్నీ అనుకూలంగా జరగాలని కోరుకుంటూ ప్రత్యేక హోమాలు జరిపించేందుకు సిద్దమయ్యారు. ఉడిపి జిల్లా సాయిరాధా ప్రకృతి చికిత్సా కేంద్రంలో గడుపుతున్న సీఎం శుక్రవారం సాయంత్రం నేరుగా చిక్‌మగళూరుకు బయలుదేరారు.
శృంగేరి శారదాదేవిని దర్శించుకుని నేరుగా కొప్పళ తాలూకా కమరడి సమీపంలోని అటవీప్రాంతంలో వెలసిన ఉమామహేశ్వరి ఆలయంలో శనివారం తెల్లవారుజాము నుంచి ఆదివారం మధ్యాహ్నం దాకా హోమాలు నిర్వహిస్తున్నారు. ఉగాది తర్వాత వచ్చిన తొలి అమావాస్య కావడంతో హోమాల ద్వారా దోషాల నివారణలకు అనుకూలమనే ఈ ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సీఎం కుమారస్వామితో పాటు భార్య రామనగర్ ఎమ్మెల్యే అనిత, కుమారుడు మండ్య లోక్‌సభ అభ్యర్థి నిఖిల్‌తోపాటు దేవేగౌడ ఆయన భార్య సోదరుడు మంత్రి రేవణ్ణ కుటుంబీకులు ఈ పూజల్లో పాల్గొననున్నారు.