రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. నియంత్రిత సాగు లేదు.. మంచిధర ఉన్నచోట అమ్ముకోవచ్చు.. నేటి నుంచి రైతుబంధు సాయం

|

Dec 28, 2020 | 6:38 AM

కేసీఆర్‌ నేతృత్వంలో ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో పంటలు మద్దతు ధరకు కొనుగోలు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు సాంకేతికతను అందించడం తదితర అంశాలపై చర్చించారు.

రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. నియంత్రిత సాగు లేదు.. మంచిధర ఉన్నచోట అమ్ముకోవచ్చు.. నేటి నుంచి రైతుబంధు సాయం
Follow us on

రైతుబంధు కింద సోమవారం నుంచి కర్షకుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకుఖాతాలో జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే, తెలంగాణలో నియంత్రిత సాగుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నియంత్రిత సాగు విధానం లేదని ప్రకటించింది. రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో వారే సొంతంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కేసీఆర్‌ నేతృత్వంలో ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో పంటలు మద్దతు ధరకు కొనుగోలు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు సాంకేతికతను అందించడం తదితర అంశాలపై చర్చించారు.

రైతులు పంటలు ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో…అక్కడే అమ్ముకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి. కాబట్టి ప్రభుత్వమే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అభిప్రాయపడింది. అయితే వ్యవసాయ మార్కెట్‌లో అమ్మకాలు, కొనుగోళ్లు సక్రమంగా పద్దతి ప్రకారం నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. రైతులంతా ఒకేసారి తమ పంటను మార్కెట్‌కు తీసుకురాకుండా వంతుల ప్రకారం తీసుకురావాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న రైతు వేదికల్లో రైతులు, వ్యవసాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశం కావాలని ప్రభుత్వం సూచించింది. స్థానిక పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులకు అనుగూణంగా ఏ పంటలు వేయాలనే విషయంలో అక్కడే నిర్ణయాలు తీసుకోవడంతో పాటు మద్దతు ధర వచ్చేందుకు అనువైన వ్యూహం ఎక్కడికక్కడ రూపొందించాలని సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌ ,మంత్రులు అభిప్రాయపడ్డారు.

ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని రైతులందరికి ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఆర్ధిక సాయం అందించనుందని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 61.49లక్షల మంది రైతులకు 1.52కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు గాను ఎకరానికి రూ.5వేల చొప్పున ఇవ్వనుంది. 2020 యాసంగి సీజన్‌ కోసం ప్రభుత్వం రూ. 7.515 కోట్ల రూపాయలు పంట సాయంగా అందించనున్నట్లు సీఎం తెలియజేశారు. పంట రుణాల మొత్తాన్ని నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. డిసెంబర్‌ 28నుంచి..వచ్చే ఏడాది జనవరి వరకు ఈరైతుబంధు నగదు సాయాన్ని అందించనుంది ప్రభుత్వం.