
అఖిల భారత సర్వీసుల నియామకాల కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రేపు జరగనుంది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు యూపీఎస్‌సీ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30న తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దీంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) రేపు (అక్టోబర్ 4)వ తేదీనే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ను నిర్వహించనుంది.
అయితే ఈ ఏడాది పరీక్ష తమకు చివరి అవకాశంగా ఉన్న అభ్యర్థులకు అదనపు అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం యూపీఎస్‌సీని కోరింది. కోవిడ్-19 మహమ్మారి.. అదేవిధంగా దేశంలోని పలు ప్రాంతాల్లో సంభవించిన వరదలను దృష్టిలో ఉంచుకుని 20 మంది సివిల్ సర్వీస్ అభ్యర్థుల బృందం పరీక్ష వాయిదా కోరుతూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు పై విధంగా స్పందించింది.