కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చైర్ పర్సన్ గా ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా విరాళాలు అందాయని బీజేపీ ఆరోపించగా.. కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. చైనాకు చెందిన వివిధ కంపెనీల నుంచి ‘పీఎం కేర్స్ ఫండ్’ కి భారీగా విరాళాలు అందాయని ఆరోపించింది. జియోమీ, ఓప్పో, హువీ వంటివాటితో బాటు పలు చైనా సంస్థలు కోట్లాది రూపాయలను ఈ ఫండ్ కి డొనేషన్స్ గా ఇఛ్చాయని కాంగ్రెస్ అధికారప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. చైనా పట్ల ప్రధాని మోదీ మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఆయన విమర్శించారు. చైనా కంపెనీల విరాళాలు పీఎం కేర్స్ ఫండ్ కి అందడం దేశ భద్రతకు ముప్పు కలిగించే విషయమన్నారు. సోనియా, ఆమె కుటుంబ ఆద్వర్యంలోని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వంటి సంస్థలకు అందుతున్న విరాళాలు ఈ తరహా డొనేషన్స్ కావని ఆయన చెప్పారు.
గత మే 20 న పీఎం కేర్స్ ఫండ్ లోకి 9,678 కోట్ల డొనేషన్స్ వఛ్చి చేరాయని, చైనా సైనికులు మన భూభాగంలోకి చొరబడినప్పటికీ.. ఆ దేశ కంపెనీల నుంచి మోదీ ఇలా విరాళాలను అందుకోవడం షాక్ కి గురి చేస్తోందని సింఘ్వీ అన్నారు. హువీ సంస్థ నుంచి మీరు 8 కోట్లు అందుకోలేదా.. ఆ సంస్థకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో సంబంధం ఉన్న విషయం మీకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. టిక్ టాక్ 30 కోట్లను ఇచ్చిందని, 38 శాతం యాజమాన్య వాటా కలిగిన పే టీఎం 100 కోట్లను, జియామీ 15 కోట్లను. ఓప్పో కోటి రూపాయలను డొనేట్ చేసిందని ఆయన వివరించారు. పీఎం కేర్స్ ఫండ్ ప్రధాని వ్యక్తిగత ఫండ్ మాదిరి పని చేస్తోందని, అధికారులెవరూ ఆడిట్ చేయడంలేదని, పైగా సమాచార హక్కు చట్టం కింద కూడా ఎవరూ ప్రశ్నించలేని విధంగా ఉందని అభిషేక్ మను సింఘ్వీ మండిపడ్డారు.