సామాజిక సేవ పేరుతో మోసం.. 3 కోట్ల రూపాయలు వసూలు.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు
గుంటూరు జిల్లాలో ఓ ఘరానా మోసం వెలుగు చూసింది. సామాజిక సేవ పేరుతో ప్రవేశించిన ఓ సంస్థ చివరికి పలువురిని కోట్ల రూపాయలకు ముంచేసింది. చివరికి సంస్థ కోసం పని చేసిన ఉద్యోగులను కూడా నిండా ముంచేసి చెక్కేసింది.
Cheating in the name of social service: గుంటూరు జిల్లాలో ఓ ఘరానా మోసం వెలుగు చూసింది. సామాజిక సేవ పేరుతో మూడు కోట్ల రూపాయలకు టోకరా వేసిన మోసమిది. బాధితులు పోలో మంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
సిటిజన్స్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ పేరుతో సామాజిక సేవా చేస్తామంటూ కొందరు గుంటూరు జిల్లాలోకి వచ్చారు. దాదాపు మూడు కోట్ల రూపాయలు వసూలు చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మహిళలకు కుట్టు మిషన్లు నేర్పించి ఇళ్లు కట్టిస్తామంటూ వసూళ్ళకు పాల్పడ్డారు. ప్రతి మండలంలో కార్యాలయాలు ఏర్పాటు చేసి వసూళ్ళకు పాల్పడిన ఈ సంస్థకు చైర్మన్‌గా బొల్లా ప్రసన్న కుమార్ వ్యవహరించారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
చివరికి సంస్థలో పని చేసిన ఉద్యోగులకు కూడా సంవత్సరం నుండి జీతాలు చెల్లించలేదు. కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న భవనాలకు అద్దెలు కూడా కట్టలేదు. తాము మోసపోయామని ఎట్టకేలకు గుర్తించిన బాధితులు గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. చైర్మెన్ ప్రసన్న కుమార్‌పై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.