
బోఫోర్స్ కేసులో దర్యాప్తు కొనసాగించేందుకు ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ గురువారం ఉపసంహరించుకుంది. ఫిబ్రవరి 1, 2018లో దాఖలు చేసిన పిటిషన్‌ను తాము ఉపసంహరించుకుంటున్నట్లు దర్యాప్తు సంస్థ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ నవీన్ కుమార్ కశ్యప్‌ని కోరారు. దీనికి కోర్టు అనుమతించింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగించడానికి సీబీఐ ట్రయిల్ కోర్టును అనుమతి కోరింది.
ఈ కేసుకి సంబంధించిన అదనపు సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నట్లు చెప్పిన సీబీఐ కోర్టు నిర్ణయం వెలువడక ముందే తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తులో కోర్టు అనుమతి ఎందుకు అవసరమని సీబీఐను 4 డిసెంబర్ 2018న న్యాయస్థానం ప్రశ్నించింది.
మరోవైపు ఈ కేసులోని నిందితులను విడుదల చేస్తూ 2005 మే 31 వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 2, 2018న సీబీఐ సుప్రీం కోర్టులో అప్పీల్ చేసింది. ఇక ఈ అప్పీల్‌ను నవంబర్ 2, 2018న సుప్రీం కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.
1986లో స్వీడన్‌కి చెందిన ఆయుధాల తయారీ సంస్థ బోఫోర్స్ భారత సైన్యానికి 155 ఎంఎం 400 ఫిరంగులను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొంది. ఈ డీల్ విలువ 1.3 బిలియన్ డాలర్లు. కాగా ఈ ఒప్పందంలో అప్పటి ప్రధాని అయిన రాజీవ్ గాంధీకి ఈ ముడుపులు ముట్టాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.