
వైసీపీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే కుల వివాదంలో చిక్కుకున్నారు. షెడ్యూల్ కులానికి చెందిన మహిళ కాకపోయినా ఎస్సీనంటూ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలుపొందారని ఆమెపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం ఆసరాగా చేసుకుని టిడిపి నేతలు ఎమ్మెల్యేపై తీవ్రమైన ఆరోపణలతో దూకుడు ప్రదర్శిస్తున్నారు.
గుంటూరు జిల్లా తాడికొండ శాసన సభ్యురాలు శ్రీదేవిపై కుల వివాదం రాజుకుంది. ఆమె షెడ్యూలు కులాలకు చెందిన వారు కాకపోయినా రిజర్వుడు స్థానమైన తాడికొండ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారని టిడిపి నేతలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కులాన్ని తప్పుగా పేర్కొనడం నేరమని వారు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి అనర్హురాలిగా ప్రకటించి, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు శ్రీదేవిపై తగిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
టిడిపి నేతల ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఉండవల్లి శ్రీదేవిని విచారణకు రావాలని కోరారు. అన్ని వివరాలతో వచ్చిన శ్రీదేవిని, జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ విచారించారు. శ్రీదేవి స్టడీ సర్టిఫికేట్లను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. తన మెడిసిన్ సర్టిఫికేట్లను జెసికి చూపించారు శ్రీదేవి. వైద్యురాలిగా చేసిన సర్వీసును కూడా తగు పత్రాలతో సాక్ష్యాలుగా చూపించారు శ్రీదేవి. శ్రీదేవి చూపించిన పత్రాలను క్రాస్ చెక్ చేసిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామని జెసి చెబుతున్నారు. తెలుగుదేశం హయాంలో రాజధాని నిర్మాణం పేరిట జరిగిన అవినీతిని తాను ప్రశ్నిస్తున్నందునే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని శ్రీదేవి ఆరోపిస్తున్నారు.