పశ్చిమ బెంగాల్ పై బీజేపీ కన్ను, పార్టీ పటిష్టతకు కసరత్తు, ఏడుగురు సీనియర్ నేతలకు గురుతర బాధ్యత

| Edited By: Pardhasaradhi Peri

Dec 17, 2020 | 6:24 PM

పశ్చిమ బెంగాల్ పై బీజేపీ గతంలో ఎన్నడూ లేనంతగా దృష్టి సారించింది. ఆ రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్ఠతకు, ఎన్నికల వ్యూహ రచనకు ఏడుగురు సీనియర్ నేతలను నియమించింది. వీరంతా త్వరలో..

పశ్చిమ బెంగాల్ పై బీజేపీ కన్ను, పార్టీ పటిష్టతకు కసరత్తు, ఏడుగురు సీనియర్ నేతలకు గురుతర బాధ్యత
Follow us on

పశ్చిమ బెంగాల్ పై బీజేపీ గతంలో ఎన్నడూ లేనంతగా దృష్టి సారించింది. ఆ రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పార్టీ పటిష్ఠతకు, ఎన్నికల వ్యూహ రచనకు ఏడుగురు సీనియర్ నేతలను నియమించింది. వీరంతా త్వరలో బెంగాల్ వెళ్లనున్నారు. వచ్ఛే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ  ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా కె.పి. మౌర్య, గజేంద్ర సింగ్ షెకావత్, ప్రహ్లాద్ పటేల్, సంజీవ్ బలియాన్, అర్జున్ ముందా, మను సుఖ్ మాండవీయ, నరోత్తమ్ మిశ్రాలకు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. వీరిలో ప్రతి ఒక్కరికీ ఆరేసి లోక్ సభ నియోజకవర్గాలను కేటాయించారు. కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి ఎలెక్షన్ స్ట్రాటజీ ని రచించడం వీరి గురుతర బాధ్యత. ఆసెంబ్లీ ఎన్నికలకు 15 లేదా 20 రోజుల ముందే వీరు తమ ప్రాంతాల్లో క్యాంప్ చేయాల్సి ఉంటుంది. హోం మంత్రి అమిత్ షా రేపో, మాపో బెంగాల్ ను సందర్శించనున్నారు. ఆ సమయంలో ఈ నేతలకు ఏయే లోక్ సభ నియోజకవర్గాలను కేటాయించాలో నిర్ణయిస్తారని అంటున్నారు.

ఈ ఏడుగురు ఎప్పటికప్పుడు పార్టీ హైకమాండ్ తో టచ్ లో ఉండాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యూహాల గురించి ఎవరికి వారు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్ లో ఎలాగైనా సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నదే బీజేపీ వ్యూహంగా కనబడుతోంది. బెంగాల్ నుంచి ముగ్గురు ఐ పీ ఎస్ అధికారులను వెంటనే తిరిగి  కేంద్రానికి రావలసిందిగా హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అయితే దీనిపై మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.