సీఎం కేసీఆర్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ భేటీపై బీజేపీ భగ్గుమంది. అరాచక పార్టీ ఎంఐఎంతో టీఆర్ఎస్ బహిరంగంగా జతకట్టడం.. ప్రజానికానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారంటూ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ కవలలుగా మారాయన్నారు. దేశ జాతీయ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు వీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో మత రాజకీయాలు చేస్తూ.. ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారన్నారు. సీఎం అండతో.. నిజామాబాద్‌లో ఎంఐఎం పార్టీ సభ నిర్వహించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అసలు ప్రకటన కూడా రాని ఎన్‌ఆర్సీపై.. వీరంతా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. దేశ ప్రయోజనాలు, జాతీయ భద్రత కోసం ఉద్దేశించిన చట్టాలపై విపక్షాల విష ప్రచారాన్ని ప్రజలు గ్రహించాలని కృష్ణ సాగర్ రావు కోరారు.