బీజేపీ ఎంపీ కౌశల్ కిషోర్ కుమారుడు ఆయుష్ పై కాల్పులు జరగడంతో ఆయన గాయపడ్డాడు. లక్నోలో ఆయనపై ఈ ఎటాక్ జరిగింది. స్వల్ప గాయాలకు గురైన ఆయుష్ హాస్పిటల్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆయుష్ బావను అరెస్టు చేశారు. ఎవరినో కేసులో ఇరికించడానికి మొదట ఆయుష్ తనపై తాను కాల్పులు జరుపుకోవాలనుకున్నాడని, కానీ తన సాయం కోరడంతో తాను అతనిపై కాల్పులు జరిపానని ఆయన చెప్పారని పోలీసులు వెల్లడించారు. లైసెన్స్ గల పిస్టల్ ను వారు ఆయుష్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. తను అతనిపై ఫైర్ చేసింది నిజమేనని ఆ బంధువు అంగీకరించాడు. ఒక వ్యక్తిని కేసులో ఇరికించేందుకు ఆయుష్ ఈ పన్నాగం పన్నాడని ఆయన చెప్పాడు. వీరి వ్యవహారం ఖాకీలకు అనుమానాస్పదంగా కనబడుతోంది. ఆయుష్, ఇతని బావ డ్రామా ఆడుతున్నారా అని వారు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఆయుష్ అజ్ఞాతంలోకి వెళ్ళాడు. ఆయన ఎక్కడున్నదీ తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నామని, ఆయుష్ బంధువు చెబుతున్నది నమ్మదగినదిగా కనిపించడంలేదని వారు పేర్కొన్నారు. కాగా గత ఏడాది ఆయుష్ వివాహం జరిగిందని, అప్పటి నుంచి అతడు తనతండ్రి కౌశల్ కిషోర్ తో విడిపోయి ఉంటున్నాడని తెలిసింది. తమ కుమారుడు తమ అభీష్టాన్ని కాదని ఒక యువతిని పెళ్లి చేసుకున్నాడని, అప్పటి నుంచి అతనికి తాము దూరంగా ఉంటున్నామని బీజేపీ ఎంపీ కౌశల్ కిషోర్ తెలిపారు. ఏడాది కాలంగా అతనితో తమకు సంబంధాలు లేవన్నారు. అయితే ఈ నెల 2 న ఆయుష్ పై ఇలా దాడి జరిగిందని తెలియగానే కౌశల్ కిషోర్ తన భార్యతో సహ..ఆయుష్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :