Bjp – Janasena Ramateertha Dharma Yatra Live Updates : బీజేపీ-జనసేన రామతీర్థ థర్మయాత్రలో తీవ్ర ఉద్రిక్తత, లైవ్ అప్డేట్స్

|

Jan 07, 2021 | 11:29 AM

ఛలో రామతీర్థం.. బీజేపీ, జనసేన మెగా కార్ ర్యాలీ. రామతీర్థం పోయివస్తామంటున్న జనసేన, కమలనాథులు. కొండపైకి అనుమతి లేదు.. ర్యాలీలకు..

Bjp - Janasena Ramateertha Dharma Yatra Live Updates : బీజేపీ-జనసేన రామతీర్థ థర్మయాత్రలో తీవ్ర ఉద్రిక్తత, లైవ్ అప్డేట్స్

Ramateertham live updates : ఛలో రామతీర్థం.. బీజేపీ, జనసేన మెగా కార్ ర్యాలీ. రామతీర్థం పోయివస్తామంటున్న జనసేన, కమలనాథులు. కొండపైకి అనుమతి లేదు.. ర్యాలీలకు అసలు ఛాన్సే లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఈ ఉదయం 11 గంటలకు రామతీర్థం టూర్‌కు బీజేపీ శ్రేణులు ప్లాన్ చేయడంతో పోలీసులు ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు.  ఆలయాల్లో విగ్రహాల ధ్వంసంపై బీజేపీ, జనసేన ఆందోళన వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఇతర నాయకులు ఇవాళ రామతీర్థం సందర్శించనున్నారు. ధర్మయాత్ర పేరుతో ఆ రెండు పార్టీలు ఈ కార్యక్రమం చేపట్టాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Jan 2021 02:12 PM (IST)

    ఇది పద్దతి కాదు..వైసీపీ సర్కార్‌పై సోము వీర్రాజు సీరియస్

    వైసీపీ సర్కార్ తీరును ట్విట్టర్ వేదికగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుబట్టారు. రామతీర్థం సందర్శనకు ధర్మయాత్ర చేపట్టామన్నారు. రామతీర్థానికి వెళ్లే తమను అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులపై సీఎం జగన్ కక్ష కట్టారన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబును సగౌరవంగా రాముడి చెంతకు తీసుకెళ్లారన్నారు. తాము వెళ్తేంటే ఎందుకు అడ్డుకుంటారని సోము వీర్రాజు ప్రశ్నించారు. వైసీపీ, టీడీపీ లాలూచీ పడ్డాయా అని సీరియస్ అయ్యారు.

  • 05 Jan 2021 02:01 PM (IST)

    బాధ్యులపై త్వరగా చర్యలు తీసుకోవాలి : బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి

    రామతీర్థ ఘటన దురదృష్టకరమని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌ రెడ్డి ఆవేదన చెందారు. రామతీర్థం వెళ్లే వారిని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉన్నా.. పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రామతీర్ధం ఘటనలో బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


  • 05 Jan 2021 01:58 PM (IST)

    సోము వీర్రాజును వాహనాల్లో తిప్పుతున్న పోలీసులు

    విజయనగరం జిల్లా గరివిడి పోలీసుస్టేషన్‌ నుంచి సోము వీర్రాజు తరలించారు. వాహనాల్లోనే పోలీసులు తిప్పుతున్నారు. రామతీర్థంలో దుండగులు ధ్వంసం చేసిన కోదండరాముడి విగ్రహాన్ని చూసేందుకు బీజేపీ, జనసేన రామతీర్థ ధర్మయాత్ర చేపట్టింది. పోలీసు ఆంక్షల నడుమ సోము వీర్రాజు రామతీర్థం జంక్షన్​ చేరుకున్నారు. అక్కడ పోలీసులు, నేతలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు సోము వీర్రాజును అరెస్టు చేసి గరివిడి పోలీసుస్టేషన్​కు తరలించారు. అక్కడి నుంచి వాహనాల్లోనే తిప్పుతున్నారు.

  • 05 Jan 2021 01:39 PM (IST)

    కృష్ణాజిల్లా మైలవరంలో రామతీర్థ ధర్మ యాత్ర పేరిట బీజేపీ, జనసేన సంయుక్త ర్యాలీ

    రామతీర్థ ధర్మ యాత్ర పేరిట బీజేపీ, జనసేన కృష్ణాజిల్లా మైలవరంలో సంయుక్త ర్యాలీ నిర్వహించాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులు వెల్లంపల్లి, కొడాలి నాని టార్గెట్ గా బీజేపీ, జనసేన నేతలు ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. నియోజకవర్గ కేంద్రమైన మైలవరంలో ఎమ్మార్వోకి వినతిపత్రం సమర్పించి కార్యాలయం ముందు రెండు పార్టీల శ్రేణులు నిరసన తెలిపారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ సమన్వయకర్త అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై నిలదీస్తే మంత్రి కొడాలి నాని బూతులు మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని ఈ సందర్భంగా నేతలు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దేవాలయాలు, విగ్రహాల ధ్వంసం ఘటనలు జరగడం విచారకరమని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

  • 05 Jan 2021 01:11 PM (IST)

    తీవ్ర ఆగ్రహానికి గురైన సోము వీర్రాజు, ‘..కుర్చీ నుంచి దించే వరకు నిద్రపోము’ అంటూ శపథం

    రామతీర్థం వెళుతోన్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజును పోలీసులు అడ్డుకున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొని అది తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో సోమువీర్రాజు కిందపడిపోయారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. విగ్రహాల ధ్వంసం విషయంలో సీఎం జగన్, మంత్రుల వైఖరిని ఆయన ఈ సందర్భంలో తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నియంతృత్వ పోకడలకు పోతున్నారని మండిపడ్డారు. రామతీర్థంలో పోలీసులు సెక్షన్30 అమలు చేయడంపై సోము ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం పర్యటన ఉండగా, ఎంపీ విజయసాయిరెడ్డికి ఏ విధంగా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ‘జగన్‌…నిన్ను సీఎం కుర్చీ నుంచి దించే వరకు మేము నిద్రపోము’ అంటూ శపథం చేశారు.

     

  • 05 Jan 2021 01:09 PM (IST)

    జనసేన నేతలు, శ్రేణుల గృహ నిర్బంధాలు… అరెస్టులు అప్రజాస్వామికం : జనసేన పార్టీ

    రామతీర్థం వెళ్తున్న తమ పార్టీ నేతలు, శ్రేణులను గృహ నిర్బంధాలు చేయడంపై జనసేన పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అరెస్టులు అప్రజాస్వామికమని ఆపార్టీ వ్యాఖ్యానిస్తూ  ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.

  • 05 Jan 2021 12:20 PM (IST)

    గృహ నిర్బంధంపై మండిపడ్డ బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, గొంతునొక్కే ప్రయత్నమని ఆగ్రహం

    రామతీర్థకు వెళ్లనీయకుండా పోలీసులు గృహ నిర్బంధం చేయడంపై ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. పోలీసుల సాయంతో ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు, విశాఖపట్నంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్, అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరశురామ రాజు తదితరుల్ని పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. విశాఖ జిల్లాకు చెందిన మరో 25 మంది బీజేపీ నేతలకు ముందస్తు నోటీసులు ఇచ్చి గృహనిర్బంధం చేశారు.

  • 05 Jan 2021 11:53 AM (IST)

    విజయనగరం కోట జంక్షన్ దగ్గర జనసేన నేతల్ని ఆపి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు

    ఛలో రామతీర్ధం కార్యక్రమంలో భాగంగా నిరసన తెలియచేయడానికి వెళుతున్న జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు పలు చోట్ల చుక్కెదురైంది. అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు, ఇతర జనసైనికులను విజయనగరం కోట జంక్షన్ దగ్గర ఆపిన పోలీసులు అరెస్ట్ చేసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • 05 Jan 2021 11:27 AM (IST)

    విజయసాయి, చంద్రబాబుని అనుమతించి, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును ఎలా అడ్డగిస్తారు? : జీవీఎల్ న‌ర‌సింహారావు

    రామతీర్థానికి దారి తీసే మార్గాలన్నింటినీ మూసివేసి, బీజేపీ నేతల్ని అడ్డుకోవడంపై బీజేపీ ఎంపీ, ఆపార్టీ సీనియర్ నేత జీవీఎల్ న‌ర‌సింహారావు మండిప‌డ్డారు. రామతీర్థంకు బీజేపీ-జనసేన శాంతియుత యాత్రను అడ్డుకునే వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పద్ధతులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి, టీడీపీ అధినేత చంద్రబాబులను పోలీసు రక్షణతో సందర్శించడానికి అనుమతించి, తమ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుని ఎలా నిరోధించారని ఆయన ప్రశ్నించారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు?’ అని జీవీఎల్, జగన్ సర్కారుని నిల‌దీశారు.

  • 05 Jan 2021 11:18 AM (IST)

    సీఎం రమేష్, కామినేని శ్రీనివాస్‌ను అడ్డుకున్న పోలీసులు

    విశాఖపట్నం బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి రామతీర్థకు బయలుదేరేందుకు సిధ్ధమైన బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ లను పోలీసులు అడ్డుకున్నారు. రామతీర్థం వెళ్లేందుకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతి లేదని వారికి తేల్చిచెప్పిన పోలీసులు ఇరువురికి నోటీసులిచ్చారు.

  • 05 Jan 2021 11:03 AM (IST)

    ఉద్రిక్తతకు దారి తీస్తోన్న ‘రామతీర్థం ధర్మాయాత్ర’, పలు చోట్ల తోపులాటలు

    బీజేపీ, జనసేన పార్టీలు చేపట్టిన ‘రామతీర్థం ధర్మాయాత్ర’ ఉద్రిక్తతకు దారి తీస్తోంది. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి రామతీర్థంకు వెళ్తోన్న బీజేపీ, జనసేన నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పలువురు నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన, బీజేపీ నేతలకు పోలీసులకు మధ్య పలుచోట్ల తోపులాట జరిగింది. బీజేపీ, జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు రామతీర్థం ధర్మయాత్రకు వచ్చిన పిఠాపురం, ఏలూరు, విజయవాడ, నెల్లూరుకు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ఆయాచోట్ల తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • 05 Jan 2021 10:49 AM (IST)

    వారిని అరెస్టు చేయడం సమంజసమేనా?: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి

    రామతీర్థాన్ని పరిశీలించేందుకు వెళుతున్న వారిని అరెస్టు చేయడం సమంజసమేనా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి. ఈరోజు ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కోట్లాది మంది భక్తుల మనోభావాలు గౌరవించాల్సిన బాధ్యత ఉన్నా,  ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని వాపోయారు. ఆంధ్రప్రదేశ్ ను క్రిస్టియన్ ప్రదేశ్ గా మార్చాలనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. రామతీర్థం ఘటనలో బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్వందించకపోతే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

  • 05 Jan 2021 10:37 AM (IST)

    ఇంటి దగ్గర నుంచే నిరసన తెలుపుతా, ఈ సర్కారుకి నూకలు చెల్లినట్లే: విష్ణుకుమార్ రాజు

    రామతీర్థ ధర్మ యాత్రకు వెళ్లనివ్వకుండా తనను అడ్డుకోవడంపై బీజీపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తోన్న వైసీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. పందులు, కుక్కల శాఖకు సూటయ్యే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అని.. దేవాదాయ శాఖకు ఆయన పనికిరారని చెప్పుకొచ్చారు. ఏపీలో చెత్త ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించిన ఆయన, రామతీర్థంకు వీళ్లడానికి తనకు అనుమతి ఇవ్వకపోతే, ఇంటి దగ్గర నుంచే నిరసన తెలుపుతానని ప్రకటించారు.

  • 05 Jan 2021 10:30 AM (IST)

    రామతీర్థంలో పెద్దఎత్తున ఆంక్షలు, సభలు, ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదు: జిల్లా ఎస్పీ రాజకుమారి

    శ్రీరాముడి విగ్రహ ధ్వంసం…అనంతర పరిణామాలతో అట్టుడికిపోతున్న విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జిల్లావ్యాప్తంగా భారీగా పోలీసులు మోహరించారు. రామతీర్థంలో పెద్దఎత్తున ఆంక్షలు విధించారు. రామతీర్థం పరిసరాల్లో ఇప్పటికే సెక్షన్‌ 30ను రెవెన్యూ యంత్రాంగం అమలు చేస్తోంది. సభలు, ర్యాలీల ద్వారా నిరసన తెలపాలంటే పోలీసుల ముందస్తు అనుమతిని తప్పనిసరి చేశారు. రామతీర్థం ప్రధాన ఆలయంతో పాటు బోడికొండ మెట్ల మార్గం, కొండపైనున్న కోదండరాముని ఆలయం, కొండకు వెళ్లే ముఖద్వారం, కొండ వెనుక భాగం… ఇలా ఏ దారిలో చూసినా పోలీసుల హడావుడే కనిపిస్తోంది. బోడికొండకు సమారు 500 మీటర్ల దూరంలోనే రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. మరోవైపు, బహిరంగ సభలు, ర్యాలీలు, సమావేశాల నిర్వహణకు అనుమతి లేదన్నారు జిల్లా ఎస్పీ రాజకుమారి. విగ్రహ ధ్వంసం కేసు దర్యాప్తునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

  • 05 Jan 2021 10:21 AM (IST)

    బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు

    విజయనగరం జిల్లా రామతీర్థం వెళ్తోన్న సోమువీర్రాజును నెల్లిమర్ల దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు.

  • 05 Jan 2021 10:09 AM (IST)

    బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు హౌస్ అరెస్ట్

    విశాఖలో బీజేపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రామతీర్ధంలో సెక్షన్ 30 అమల్లో ఉన్నందున బీజేపీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకి 151 సీఆర్పీసీ నోటీసులిచ్చారు. ఆయన ఇంటి ముందు పోలీసులు పహారా కాస్తున్నారు.

  • 05 Jan 2021 09:42 AM (IST)

    రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం, పోలీస్ కనుసన్నల్లో పరిస్థితులు

    రామతీర్థంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ, జనసేన తలపెట్టిన ఛలో రామతీర్థ ధర్మయాత్ర క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. రామతీర్థంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా పరిస్థితులను పూర్తిగా తమ కనుసన్నల్లోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం విజయనగరంలో కోలాహల వాతావరణం నెలకొంది.

  • 05 Jan 2021 09:33 AM (IST)

    రామతీర్థం జంక్షన్‌లో మోహరించిన పోలీసులు

    రామతీర్థం జంక్షన్‌లో భారీగా పోలీసుల మోహరించారు.  ధర్మయాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే విజయనగరం చేరుకున్నారు బీజేపీ నేతలు సోము వీర్రాజు, మాధవ్‌. రామతీర్థం వెళ్లేందుకు అనుమతి లేదని చెబుతున్నారు పోలీసులు.

  • 05 Jan 2021 09:11 AM (IST)

    విశాఖపట్నం గాజువాకలో భారీగా బీజేపీ, జనసేన నేతల్ని నిర్భంధించిన పోలీసులు

    విజయనగరంలోని పవిత్రక్షేత్రం రామమతీర్థానికి వెళ్లకుండా ఏపీ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలోని జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులను ముందుస్తుగా హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు. ఈ తెల్లవారుజామునుంచి హౌస్ అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. బీజేపీ నాయకులు కరణం నరసింగరావు, దీనకొండ కిృష్ణరాజు, నాగేశ్వరావు, ఇంద్రశేనరెడ్డి, ఎస్టీబీఎల్ బాలాజీ, జనసేన నాయకులు పీలా రామకిృష్ణ , రెయ్యి రత్నం, కోన తాతరావు, కరణం కనకరావులను పోలీసులు ఇళ్లదగ్గరే నిర్భంధించారు.

  • 05 Jan 2021 08:58 AM (IST)

    విశాఖపట్నం బీజేపీ నేత బాల రాజేశ్వరరావుకు పోలీసుల 151 సీఆర్పీసీ నోటీసులు

    రామతీర్థం మెగా కార్ ర్యాలీకి బీజేపీ, జనసేన పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఏపీలో ఇరుపార్టీలకు చెందిన నేతల్ని పోలీసులు నిర్భంధిస్తున్నారు. విశాఖపట్నం బీజేపీ నేత బాల రాజేశ్వరరావుకు విశాఖ పోలీస్‌లు 151 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆదేశాలిచ్చారు.

Follow us on