బీజేపీపై అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ నిప్పులు కక్కారు. ఆ పార్టీని అసలైన టుక్ డే టుక్ డే గ్యాంగ్ గా అభివర్ణించారు. ఆ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకోసం పంజాబ్ లో మత విద్వేషాన్ని,( కార్చిచ్చును) రేపాలని చూస్తోందని, జాతి సమగ్రతను నాశనం చేస్తోందని ఆయన అన్నారు. రైతు చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ అకాలీదళ్ ఎన్డీయే నుంచి వైదొలగిన విషయం గమనార్హం. మా రాష్ట్రంలో హిందువులు, సిక్కుల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టాలని బీజేపీ యత్నిస్తోందని, హింసను ప్రేరేపిస్తోందని బాదల్ అన్నారు. శాంతి యుతంగా ఉన్న పంజాబీ రైతులలోనూ విభేదాలు సృష్టించడానికి కుయుక్తులు పన్నుతోందన్నారు. అమృత్ సర్ లో మాట్లాడిన ఆయన బీజేపీని ఇంతగా దుయ్యబట్టడం ఇదే మొదటిసారి.
అన్నదాతల్లో ఖలిస్థానీ వేర్పాటువాదులు కూడా ఉన్నారని బీజేపీ ఆరోపించడంతో అకాలీదళ్ ఆగ్రహించింది. రైతుల ఆందోళనలో టుక్ డే టుక్ డే గ్యాంగ్ ప్రవేశించిందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల ఆరోపించారు. అటు మరో మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా మావోయిస్టులు, తీవ్రవాదులు ఈ రైతుల ఆందోళనను తమ చేతుల్లోకి తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే హర్యానా లో డిప్యూటీ సీఎం దుశ్యంత్ చౌతాలా కూడా రైతులపట్ల కేంద్రం పాటిస్తున్న వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.