AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైనిక శిక్షణలో రాటు దేలుతోన్న బెల్జియం రాకుమారి

రాజకుమారి అంటే ఎండకన్నెరగదని, ఏడుమల్లెలెత్తు సౌకుమార్యంగా ఉంటుందని అనుకోడానికి వీల్లేదు.. వారికి రణతంత్రపుటెత్తులూ తెలుసు.. చరిత్రలో ఎంతో మంది రాకుమారిలు కదనరంగాన కలవాలాలు ఝళింపించారు.

సైనిక శిక్షణలో రాటు దేలుతోన్న బెల్జియం రాకుమారి
Balu
|

Updated on: Sep 22, 2020 | 1:06 PM

Share

రాజకుమారి అంటే ఎండకన్నెరగదని, ఏడుమల్లెలెత్తు సౌకుమార్యంగా ఉంటుందని అనుకోడానికి వీల్లేదు.. వారికి రణతంత్రపుటెత్తులూ తెలుసు.. చరిత్రలో ఎంతో మంది రాకుమారిలు కదనరంగాన కలవాలాలు ఝళింపించారు. రాజ్యాలేలారు. శత్రుదేశాలకు వణుకుపుట్టించారు.. వర్తమానంలోనూ రాజకుమార్తెలు అన్ని విద్యలు నేర్చుకుంటున్నారు.. ఇందుకు బెల్జియం రాకుమారి ఎలిజబెత్‌ బెస్ట్‌ ఎగ్జాంపుల్‌.. అక్కడి రాజవంశాలలో పద్దెనిమిదేళ్లు నిండిన కూతుళ్లను మిలటరీ అకాడమీకి పంపిస్తారు.. అలా ఆమె కూడా రాయల్‌ మిలటరీ అకాడమీలో చేరారు.

ఎలిజబెత్‌ తండ్రి కింగ్‌ ఫిలిప్‌.. బెల్జియానికి రాజు.. ఆయన తదనంతరం సింహాసనాన్ని అధిష్టించాల్సింది ఎలజబెత్తే! అందుకే ఈ తర్ఫీదు.. ఫిలిప్‌ కూడా రాయల్‌ మిలటరీ అకాడమీలో శిక్షణ తీసుకున్నవారే! రాజవంశంలో మగపిల్లోడు అయినా, ఆడపిల్ల అయినా రక్షణ విలువలు నేర్చుకోవలసిందే! క్రమశిక్షణ, నిబద్ధతతో నడుచుకోవలసిందే! గౌరవమర్యాదలతో మెలగాల్సిందే! సాహసం ఒకరు చెబితే వచ్చేది కాకపోయినా .. ఇక్కడ శిక్షణ తీసుకుంటే యథాలాపంగానే గుండె నిండా ధైర్యం వచ్చేస్తుంది.. షూటింగ్, మార్చింగ్, మారువేషంలో తప్పించుకునే టెక్నిక్‌లను కూడా నేర్పిస్తారు. ఎలిజబెత్‌కు నాలుగువారాలపాటు శిక్షణ ఇస్తున్నారక్కడ.. మిలటరీ డ్రెస్‌లో యుద్ధ విద్యలు నేర్చుకుంటున్న ఆమె ఫోటోలు ఈ మధ్యనే వెలుగులోకి వచ్చాయి.. ఈ నెల 25న శిక్షణ ముగించుకుని రాజసౌధంలోకి తిరిగి వెళ్లిపోయే ముందు రాయల్‌ మిలటరీ అకాడమీలో పెద్ద ఉత్సవం జరుగుతుంది.. యూనివర్సిటీల్లో జరిగే స్నాతకోత్సవం లాంటిదే! తల్లిదండ్రుల సమక్షంలో రాకుమారికి బ్లూబెరెట్‌ తొడుగుతారు.. ఇదో గౌరవం.. బ్లూ బెరెట్‌ సెర్మనీ తర్వాత రెండో దశ శిక్షణ మొదలవుతుంది. బెల్జియం రాచకుటుంబంలో ఎలిజబెతే పెద్దమ్మాయి. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు, ఓ చెల్లెలు ఉంది.