నటసింహ బాలకృష్ణ సినిమా డైలాగ్స్… వెండితెరపైనే కాదు..అప్పుడప్పుడు రాజకీయాల్లోనూ పేలుతుంటాయి.. సినిమా కోసం ఆ డైలాగ్స్ రాశారా…లేక ప్రస్తుత రాజకీయాలకు అన్వయిస్తూ ఆయనతో ఆ డైలాగులు పలికించారో తెలీదు కానీ…రాజకీయవర్గాల్లో మాత్రం ఇప్పుడు అవే డైలాగ్స్ చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా బాలయ్య రూలర్ సినిమాలో పలికిన ఒక డైలాగ్ వివాదాలకు దారి తీసింది.
బాలయ్య సినిమా అంటే చాలు..అభిమానులు డైలాగ్స్ ఎక్కువ కోరుకుంటారు. ఇప్పుడని కాదు ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహానాయుడు’ సినిమాల సమయం నుంచి ఇదే వేవ్ కొనసాగుతోంది. స్వతహాగా రాజకీయ నేపథ్యం ఉండటంతో బాలయ్య డైలాగ్స్ చెబితే..వాటిని రియల్ లైఫ్‌కి అన్వయించుకుంటారు ఫ్యాన్స్. తాజాగా ఆయన కొత్తసినిమా రూలర్ లో ఆయన డైలాగ్ ‘పొలిటికల్ పవరేమన్నా నువ్వు తీసుకున్న డిగ్రీ అనుకున్నావా..జీవితమంతా నీతో ఉంటుందనుకోవడానికి… ఎలక్షన్ ఎలక్షన్ కీ పవర్ కట్ అయిపోతుందిరా పోరంబోకా’..అంటూ బాలకృష్ణ పేల్చిన పొలిటికల్ డైలాగ్… రాజకీయవర్గాల్లో ఓ రణరంగమే సృష్టిస్తోంది. అధికార పార్టీని ఉద్దేశించే ఆ డైలాగ్ ఉందని టీడీపీ కార్యకర్తలు, బాలకృష్ణ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటున్నారు. సాధారణంగా అసెంబ్లీలో బాలకృష్ణ పెద్దగా మాట్లాడరు. కానీ తాను చెప్పాలనుకున్నవన్నీ సినిమా ట్రైలర్ల ద్వారా చెప్పిస్తారనేది సినీ వర్గాల టాక్.
గతంలో 2014 ఎన్నికలకు ముందు బాలకృష్ణ లెజెండ్ సినిమా రిలీజ్ అయింది..అప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు బాలకృష్ణ.. ఆసమయంలో బయటకు వచ్చిన లెజెండ్ ట్రైలర్ సంచలనం సృష్టించింది..’చెప్పండి వాడికి…సెంటరైనా స్టేట్ అయినా …పొజిషనైనా.. అపోజిషనైనా..పొగరైనా..పవరైనా.. నేను దిగనంతవరకే… ఒన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్’ అంటూ వచ్చిన డైలాగ్ రాజకీయవర్గాల్లో కలవరం సృష్టించింది. ‘రాష్ట్ర రాజకీయం పుట్టిందే మా ఇంట్లోరా బ్లడీ ఫూల్’ అంటూ పవర్ ఫుల్ డైలాగులు పేల్చారు అప్పట్లో బాలయ్య.. తాజాగా ..ఎలక్షన్ ఎలక్షన్ కీ పవర్ కట్ అయిపోతుందిరా పోరంబోకా డైలాగ్ మరోసారి అలాంటి చర్చనే తీసుకొచ్చింది.
మొన్నటి ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలయ్యింది. అప్పటివరకు అధికారంలో ఉన్న తెలుగుదేశానికి కేవలం 23సీట్లు మాత్రమే వస్తే…వైసీపీకి 151స్థానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ డైలాగ్ సీఎం జగన్ ని ఉద్దేశించి చేసిందేనని టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. కాదు ఇది కచ్చితంగా చంద్రబాబుకు వర్తిస్తుందంటున్నారు వైసీపీ కార్యకర్తలు.. ఈ విధంగా సోషల్ మీడియాలో పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నారు.