ఒక్కోసారి ఇంటిపేరు పంటికింద రాయిలా తెగ బాధపెడుతుంటుంది.. మార్చుకోడానికి అదేం పెద్దలు పెట్టిన పేరు కాదు కదా! కట్టే కాలేవరకు అట్టే ఉంటుందాయె! అసోంలోని గోగాముఖ్ నగరానికి చెందిన ప్రియాంక చూతియాకు ఇప్పుడు ఇంటిపేరే పెద్ద సమస్యగా మారింది.. తన ఇంటిపేరు చూతియా కావడంతో ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఉద్యోగానికి అప్లై కూడా చేయలేకపోయింది పాపం..
ప్రియాంక చూతియా చదివింది పెద్ద చదువే! అగ్రికల్చరల్ ఎకానమిక్స్, వ్యవసాయ నిర్వహణలో మాస్టర్స్ చేసింది. ఆమె అసోంలో చూతియా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఇంటిపేరు చూతియా కావడమే ఆమెకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఎన్నిసార్లు దరఖాస్తు చేయడానికి ప్రయత్నించినా పోర్టల్ మాత్రం రిజెక్ట్ చేస్తూనే ఉంది. తను అనుభవిస్తున్న బాధనంతా ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకుంది. తన ఇంటి పేరుతో అప్లై చేస్తుంటే సరైన పదాలను ఉపయోగించమని ఎర్రర్ మెసేజ్ వస్తూనే ఉందని తెగ ఫీలైంది. ఇది తప్పుడు పదం కాదని, మా కమ్యునిటీకి సంబంధించిన పదమని ఆవేదన చెందింది ప్రియాంక. ఇక లాభం లేదనుకుని ఎన్‌ఎస్‌సీఎల్‌కే తన సమస్యను చెప్పుకుని పరిష్కారం చూపమని అభ్యర్థించింది.. వెంటనే ఆమె అభ్యర్థిత్వాన్ని అంగీకరించింది ఎన్‌ఎస్‌సీఎల్.
అసలు విషయమేమిటంటే.. చూతియా అంటే హిందీ భాషలో బూతు . దీంతో సదరు ఆన్‌లైన్ పోర్టల్‌లో ఆ పదాన్ని రిజక్టెడ్ లిస్ట్‌లో పెట్టారు. అది ఇంటిపేరు కావడం ప్రియాంక తప్పు కాదు.. ఆ ఇంటిపేరు ఉండటమూ తప్పేమీ కాదు.. చూతియా ఇంటిపేరుతో ఉన్న చాలా మంది అకౌంట్లను ఫేస్‌బుక్ బ్లాక్ చేసిందట!