ఏపీ రాజధాని మార్చే ఉద్దేశం ఉంటే సీఎం జగన్ తాడేపల్లిలో ఇల్లు ఎందుకు నిర్మించుకుంటారని ప్రతిపక్షాలను ప్రశ్నించారు మంత్రి అవంతి శ్రీనివాస్. అమరావతి నుంచి రాజధాని మార్చే ప్రసక్తి లేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే జరుగుతుందన్నారు మంత్రి. ప్రతిపక్ష టీడీపీకి ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి,మద్యపానంపై టీడీపీ తన వైఖరి బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
విశాఖ భూకుంభకోణంపై సిట్ పునర్విచారణకు కొద్దిరోజుల్లో ఆదేశాలు జారీ చేయనున్నామని, టీడీపీ హయాంలో జరిగిన భూకబ్జాలను ప్రజలు మర్చిపోలేదన్నారు. ఇసుక కోసం టీడీపీ ధర్నా చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందంటూ అవంతి ఎద్దేవా చేశారు.సెప్టెంబర్ 5న ఇసుక పాలసీ ప్రకటిస్తున్నామని తెలిపారు. తహసీల్దార్ వనజాక్షిని హింసించిన ఘటన ప్రజలు మర్చిపోలేదని, వైసీపీకి ప్రజలు ఐదేళ్ల పాలనకు అధికారం ఇస్తే, టీడీపీ నేతలు 5నెలలు కూడా వుండలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమరావతి రైతుల పట్ల గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలన్నారు.