AP Local War : కీలక ఘట్టానికి పంచాయతీ ఎన్నికలు, విపక్షాల పట్టు, అధికారపక్షం గుస్సా.! బిగ్ ఫైట్, మినిట్ టు మినిట్

| Edited By: Ram Naramaneni

Jan 28, 2021 | 7:16 PM

నువ్వా, నేనా అన్నట్టు సాగిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పోరులో ఏపీ ఎన్నికల సంఘం పై చేయి సాధించింది. అదే సమయంలో జగన్ సర్కారుకు..

AP Local War : కీలక ఘట్టానికి పంచాయతీ ఎన్నికలు, విపక్షాల పట్టు, అధికారపక్షం గుస్సా.! బిగ్ ఫైట్, మినిట్ టు మినిట్

నువ్వా, నేనా అన్నట్టు సాగిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పోరులో ఏపీ ఎన్నికల సంఘం పై చేయి సాధించింది. అదే సమయంలో జగన్ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురవడంతో పంచాయతీ ఎన్నికల ఘట్టం షురూ అయింది. నామినేషన్ల ప్రక్రియ ముందున్న నేపథ్యంలో అధికార, విపక్షపార్టీలు మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఏకగ్రీవాల విషయమై ఒక రకమైన యుద్ధమే ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తోంది. అటు అధికారపార్టీ నేతలు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఇంకనూ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అంశాలకు సంబంధించి ఆయా పార్టీ నేతల స్పందన, ఎన్నికల సంఘం చేపడుతోన్న ఏర్పాట్లు, ఎదురవుతోన్న సమస్యలు వంటి హాట్ హాట్ సమాచారం మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఈ దిగువున చూడొచ్చు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Jan 2021 06:40 PM (IST)

    గ్రామ వాలంటీర్ల ద్వారా కూడా వైసీపీ అక్రమాల‌కు పాల్పడుతోంది : సోము వీర్రాజు

    అనేక అక్రమ పద్దతుల ద్వారా వైసీపీ నేతలు పంచాయతీల ఏక‌గ్రీవాల‌కు ప్రయ‌త్నిస్తున్నార‌ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గ్రామ వాలంటీర్ల ద్వారా కూడా వైసీపీ అక్రమాల‌కు పాల్పడుతోంద‌ని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నిక‌లు స‌జావుగా జ‌రిగేలా చూడాల‌ని గ‌వ‌ర్నర్‌ను కోరామ‌ని సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో దేవాల‌యాల‌పై దాడులు జ‌రుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రిస్తోంద‌ని గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్టు వీర్రాజు వెల్లడించారు.

  • 28 Jan 2021 06:36 PM (IST)

    గ‌తంలో నామినేష‌న్లు వేయ‌కుండా అడ్డుకున్నారు, ఆ ప్రమాదం లేకుండా చూడండి : నాదేండ్ల మనోహర్

    ఏపీ గవర్నర్ తో భేటీ అనంతరం జనసేన కీలకనేత నాదేండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై గ‌వ‌ర్నర్‌కు వివ‌రించామ‌ని మ‌నోహ‌ర్ తెలిపారు. గ‌తంలో నామినేష‌న్లు వేయ‌కుండా వైసీపీ నేత‌లు కుట్ర పూరితంగా అడ్డుకున్నార‌ని, ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో అక్రమాల‌కు తావు లేకుండా చూడాల‌ని తాము కోరామ‌ని నాదేండ్ల వివ‌రించారు. వైసీపీ నేత‌లు ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్రలోభాలు పెడుతూ, మ‌రోవైపు బెదిరింపుల‌కు పాల్పడుతున్నారని విమర్శించారు.

  • 28 Jan 2021 06:32 PM (IST)

    ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గవ‌ర్నర్ ను కలిసిన జనసేన, బీజేపీ నేతలు

    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర గవ‌ర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను జనసేన, బీజేపీ నేతలు క‌లిశారు. ప‌లు అంశాల‌పై గ‌వర్నర్ కు ఇరుపార్టీల నేతలు ఫిర్యాదు చేశారు. గ‌వ‌ర్నర్‌ను క‌లిసి వారిలో జనసేన నేత‌ నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఉన్నారు. అనంత‌రం వారిరువురూ మీడియాతో మాట్లాడారు.

  • 28 Jan 2021 06:25 PM (IST)

    రాష్ట్రంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెండు రోజుల పర్యటన

    పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏపీలో రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు. శుక్రవారం, శనివారం(రేపు, ఎల్లుండి) ఆయన పలు జిల్లాల్లో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. రేపు ఉదయం గం. 7.40 కు విజయవాడ నుంచి బెంగళూరు పయనం అవుతారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకుంటారు. పంచాయతీ ఎన్నికలపై అనంతపురం జిల్లా అధికారులతో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు సమీక్ష చేపడతారు.

    మధ్యాహ్నం 3.30 గంటలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కర్నూలు బయల్దేరి వెళ్తారు. సాయంత్రం 5.30 గంటలకు కర్నూలు చేరుకుని జిల్లా అధికారులతో సమావేశమవుతారు. ఈ సమావేశం సాయంత్రం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు ఉంటుంది ఆపై, ఎస్ఈసీ కర్నూలులోనే బస చేస్తారు.

    శనివారం ఉదయం 6 గంటలకు కర్నూలు నుంచి కడప పయనమవుతారు నిమ్మగడ్డ. కడపలో జిల్లా అధికారులతో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చిస్తారు. సమావేశం అనంతరం ఉదయం 11.30 గంటలకు కడప నుంచి విజయవాడకు తిరుగు పయనం అవుతారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.

  • 28 Jan 2021 05:30 PM (IST)

    ‘కోరినట్టే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి… ఏం పీకుతారో పీకి సత్తా చూపించండి’: మంత్రి అనిల్ కుమార్ యాదవ్

    ఎన్నికలు వస్తే సత్తా చూపుతామంటూ విపక్ష నేతలు మాట్లాడారు, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి… ఏం పీకుతారో పీకి సత్తా చూపించండి అంటూ ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి 25 శాతం సీట్లయినా సాధించే సత్తా ఉందా? అని ఆయన ఛాలెంజ్ విసిరారు. కనీసం నామినేషన్ వేసే సత్తా, దమ్ము కూడా వారికి లేవని అనిల్ ఎద్దేవా చేశారు. కనీసం 5 శాతం సీట్లను కూడా సాధించలేని కొన్ని తోక పార్టీల మాటలు కోటలు దాటుతున్నాయని అనిల్ విమర్శించారు.

  • 28 Jan 2021 05:14 PM (IST)

    ఏకగ్రీవాల ప్రకటనలపై జగన్ సర్కారు సమాధానం చెప్పాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

    కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఏకగ్రీవాలపై ప్రకటనలు ఎందుకు ఇచ్చారో జగన్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇలా దౌర్జన్యంగా ఏకగ్రీవాలు చేసుకునే పక్షంలో అసలు ఎన్నికలు ఎందుకు? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉన్న వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీకి ప్రభుత్వం సిద్ధం కావటం ఎన్నికల కోడ్ కు విరుద్ధమని ఆయన అన్నారు.

  • 28 Jan 2021 04:43 PM (IST)

    సుప్రీంతీర్పు తర్వాతైనా ఏపీ ప్రభుత్వంలో మార్పురాలేదు : సీపీఐ రామకృష్ణ

    సుప్రీంకోర్టు తీర్పు తర్వాతైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మార్పు వచ్చి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరిస్తారని అందరూ భావించారని అయితే, అలాంటి పరిస్థితి కనిపించడంలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. బాధ్యతాయుత స్థానంలో ఉన్న రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఎన్నికల కమిషన్ను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి వాయిస్ గా పేరుగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఎస్ఈసీ ని కించపరుస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు.

  • 28 Jan 2021 04:42 PM (IST)

    చంద్రబాబుకు ఆ అధికారం ఎవరిచ్చారు ? మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్న

    పల్లె ప్రగతి, పంచ సూత్రాల మేనిఫెస్టో అంటూ రిలీజ్ చేయడానికి చంద్రబాబు కు ఎవరు అధికారం ఇచ్చారు ? అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. పార్టీ రహితంగా జరగాల్సిన ఎన్నికల్లో ఎలా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు ? అని ఆయన ప్రశ్నించారు. “చంద్రబాబుకు నాకంటే వయస్సు ఎక్కవ తప్పా, నిజాయితీలో అతని కంటే నేనే ఎక్కువని” పెద్దిరెడ్డి పేర్కొన్నారు. పోటుగాడు అని నన్ను చంద్రబాబు సంబోధించడం ఆయన సంస్కారానికే వదిలేస్తున్నానని పెద్దిరెడ్డి అన్నారు. సొంత జిల్లాలో మెజారిటీ తెచ్చుకోలేని చంద్రబాబు నా గురించి మాట్లాడటామా..? అని పెద్దిరెడ్డి విమర్శించారు.

  • 28 Jan 2021 04:36 PM (IST)

    విచక్షణాధికారాన్ని, నిమ్మగడ్డ విచక్షణ లేకుండా వినియోగిస్తున్నారు : మంత్రి పెద్దిరెడ్డి

    ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన విచక్షణాధికారాన్ని… విచక్షణ లేకుండా వినియోగిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. ఏకగ్రీవంపై ప్రకటనలు ఇస్తే తప్పని చెప్పడం విడ్డూరంగా ఉందని.. నిమ్మగడ్డలాంటి వ్యక్తి తాను ఎక్కడా చూడలేదని చెప్పుకొచ్చారు. మంచి అభిప్రాయంతో ప్రకటన ఇచ్చామని, ఏకగ్రీవాలు అనేది మంచి సాంప్రదాయం అని ఆయన పేర్కొన్నారు. మద్యం, డబ్బులు పంచితే పదివేల జరిమానాతో పాటు మూడేళ్ళ జైలు శిక్ష ఉంటుందన్న ఆయన, ప్రజలందరూ స్వేచ్ఛ గా ఓటువేయాలని అన్నారు.

  • 28 Jan 2021 04:30 PM (IST)

    నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌, చంద్రబాబు ఉన్నాదుల్లా వ్యవహరిస్తున్నారు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. నిమ్మగడ్డ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. “అధికారులను నిమ్మగడ్డ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు.. కోర్టు ఉత్తర్వులు రాగానే ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. చంద్రబాబు అనుచరుడిగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు.” అంటూ పెద్దిరెడ్డి విమర్శలు చేశారు.

  • 28 Jan 2021 04:24 PM (IST)

    రాజ్యాంగ స్ఫూర్తితో కాదు, చంద్రబాబు స్ఫూర్తితో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పనిచేస్తున్నారు : వైసీపీ ఎమ్మెల్యే అంబటి

    రాజ్యాంగ స్ఫూర్తి తో కాకుండా చంద్రబాబు స్ఫూర్తితో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పని చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ప్రజాస్వామ్యంలో లేని అధికారాన్ని ప్రదర్శించాలనుకుంటే మూల్యం చెల్లించక తప్పదని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు పంచాయతీ ఎన్నికలకు మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు. చంద్రబాబుకు పిచ్చి ముదిరింది. రాజకీయాలతో సంబంధం లేని గ్రామ పంచాయతీ ఎన్నికలకు మ్యానిఫెస్టో ఎలా విడుదల చేస్తారు అని ప్రశ్నించారు. ఇప్పుడు నిమ్మగడ్డ ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి అంటూ అంబటి డిమాండ్ చేశారు.

  • 28 Jan 2021 04:13 PM (IST)

    అధికారం పోయిందన్న బాధ, మళ్లీ అధికారంలోకి రాలేమనే వ్యధ కనిపించింది : ఎమ్మెల్యే అంబటి

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిలో అసహనం పెరిగిపోయిందని, అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్‌లో ఆయన ఉన్నారని అంబటి రాంబాబు అన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మళ్లీ తాను అధికారంలోకి రాలేననే దిగులు చంద్రబాబుకు ఉందన్నారు. టీడీపీ పని అయిపోయిందని చెప్పుకొచ్చారు అంబటి.

  • 28 Jan 2021 03:51 PM (IST)

    రాజ్యాంగ పరంగా పనిచేసే వాడినని ప్రగల్బాలు పలుకుతున్నావుగా…! ఇప్పుడు చెప్పు సమాధానం.? : అంబటి

    ప్రజాస్వామ్యంలో ఎవరైనా మితిమీరి ప్రవర్తిస్తే మూల్యం చెల్లించక తప్పుదన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. రాజ్యాంగ పరంగా పనిచేసే వాడినని ప్రగల్బాలు పలుకుతున్నావుగా… ఇప్పుడు చెప్పు సమాధానం అంటూ అంబటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో ఉంది, అయినా నాకు ఓటు హక్కు కావాలనడం ఏమిటి..? అని ఆయన ప్రశ్నించారు. ‘వాళ్ళు రిజెక్ట్ చేశారని అధికారులపై కక్ష్య కట్టావా..? కనకపు సింహాసనం పై సునకాన్ని కూర్చోబెట్టినట్లు రాజ్యాంగ పదవిలో ఈయన్ని కూర్చోబెట్టారు. అంటూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • 28 Jan 2021 03:41 PM (IST)

    అలా ఎందుకు జరుగకూడదు..? కాదని ఎక్కడైనా వ్రాసి ఉందా..? : వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

    పంచాయతీ ఏకగ్రీవాల్లో ఏంటి వివాదం..? ఎందుకు జరుగకూడదు..? అలా అని ఎక్కడైనా వ్రాసి ఉందా..? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఏకగ్రీవాలను ప్రోత్సహించాల్సిన రాజకీయ పార్టీలు విచిత్రంగా వ్యవహరిస్తున్నాయన్నారు. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ఏమిటి..? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా..? అని అంబటి ప్రశ్నించారు. పార్టీల ప్రమేయం లేకుండా పంచాయతీ ఎన్నికలు జరగాలని రాజ్యాంగంలో ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

  • 28 Jan 2021 03:35 PM (IST)

    టీడీపీని బ్రతికించాలనే మీ ప్రయత్నం ఫలించదు : నిమ్మగడ్డపై అంబటి రాంబాబు హాట్ కామెంట్స్

    ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద మనిషి మీడియా సమావేశాలు పదే పదే నిర్వహించాలా..? అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. మీడియా ముందుకు వచ్చి SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మీడియా ద్వారా తన అధికారాన్ని ప్రదర్శించి భయబ్రాంతులకు గురిచేయడం సరికాదని ఆయన చెప్పుకొచ్చారు. ‘ఆయన రాజ్యాంగ స్పూర్తితో కాదు…చంద్రబాబు స్పూర్తితో పనిచేస్తున్నారు’ అని అంబటి ఆరోపణలు సంధించారు.

Follow us on