AP High Court hearing : ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించిన కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ కొంచెంసేపటిక్రితం విచారణ చేపట్టింది. దీంతో జగన్ సర్కారు వర్సెస్ ఏపీ ఎలక్షన్ కమీషన్ మధ్య జరుగుతోన్న ఎన్నికల నిర్వహణ వార్ కీలకదశకు చేరినట్టైంది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కరోనా వ్యాక్సినేషన్ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అసాధ్యం అని చెప్పినా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) నిమ్మగడ్డ రమేష్ మాత్రం ఫిబ్రవరి నుంచి ఎన్నికలంటూ షెడ్యూల్ ఇచ్చేశారు. ఆయన షెడ్యూల్ విడుదల చేసిన 24 గంటల లోపే రాజకీయం రసవత్తరంగా మారింది. ఇటు ప్రభుత్వం తరఫున, అటు ఉద్యోగ సంఘాల నుంచి సహాయ నిరాకరణ మొదలైంది. రెండు వర్గాలూ ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. దాన్ని విచారించిన కోర్టు.. నిమ్మగడ్డ షెడ్యూల్‌ని కొట్టిపారేసింది. ఆ తీర్పుతో ప్రభుత్వానిదే పైచేయిగా ఉంది. కానీ.. నిమ్మగడ్డ ఇక్కడే సెకండ్ చాయిస్‌కి వెళ్లారు. గవర్నర్ విశ్వభూషణ్‌ని కలిసి వ్యవహారం చెప్పారు. అలాగే సింగిల్ బెంచ్ పిటిషన్ సరిగా లేదని.. డివిజన్ బెంచ్‌కి వెళ్లారు.
దేశంలో నాలుగు హైకోర్టులో ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాలకే సానుకూలంగా తీర్పులు వచ్చాయని ఎస్ఈసీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. గతంలో సుప్రీంకోర్టులో కూడా ఇదే అంశాలను ప్రస్తావించినట్టు వెల్లడించింది. ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయాలలో న్యాయస్థానాలు ఇంటర్పీయర్ అవడానికి లేదన్న ఎస్ఈసీ, సింగిల్ బెంచ్ జడ్జి కన్యఫ్తూజ్ అయ్యే అలాంటి నిర్ణయం ఇచ్చి ఉంటారని ఎస్ఈసీ తరపు న్యాయవాదులు డివిజన్ బెంచ్ కు విన్నవించారు. ఈ నేపథ్యంలో విచారణ రేపటికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇక, ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనల అనంతరం రేపు ఎస్ఈసీ తరుపున న్యాయవాది ఆదినారాయణ తమ వాదనలు కొనసాగించనున్నారు.
2018లో ఎన్నికల సమయం ముగిసినా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు వెల్లడించింది. ప్రభుత్వం సహకరించని అంశాలు హైకోర్టు ముందు ఉంచామని కూడా తెలిపింది. పబ్లిక్ ఒత్తిడితో ఎన్నికల నిర్వహణకు గతేడాది ముందుకు వెళ్లామని, అయితే, కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయని పేర్కొంది. తిరిగి హైకోర్టు ఆదేశాలతోనే ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లామని, అయితే, ఎన్నికలకు వెళ్తామంటే మొదట కరోనా అన్నారు, ఇప్పుడు వ్యాక్సిన్ అంటున్నారని ఎస్ఈసీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల రద్దు నిర్ణయం సవాలు చేస్తూ ఎస్ఈసీ దాఖలు చేసిన పిటిషన్ పై అమరావతిలోని రాష్ట్ర హైకోర్టులో ఇవాళ వాడి వేడిగా వాదనలు జరిగాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉందని, అప్పటివరకూ ఎన్నికలు రద్దు చేయాలని పంచాయితీ శాఖ కార్యదర్శి ఎస్ఈసీకి లేఖ రాశారని ఈ సందర్భంగా కోర్టుకి తెలిపారు ఏజీ. అయితే, ఈ సందర్భంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. రోజుకి ఎంత మందికి వ్యాక్సిన్ వేస్తున్నారని, వేసే వారికి శిక్షణ ఇచ్చారా అని హైకోర్టు అడిగింది. ఫ్రెంట్ లైన్ వారియర్స్ కేటగిరీ కిందకు ఎవరు వస్తారని, 50 ఏళ్ల లోపు వారికి ఎప్పుడు వ్యాక్సిన్ వేస్తున్నారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో అన్నింటికీ సంబంధించి డాక్యుమెంట్స్ వారీగా కోర్టుకి ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఉన్నంతకాలం తమ ఆటలు సాగవనే స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఉద్యోగ సంఘాలను కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం చేయడం బాధాకరమని ఆపార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలును హైకోర్టు రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పిన ఆయన.. కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని విమర్శించారు. కరోనా పేరు చెప్పి ఎన్నికలను అడ్డుకున్నారని, మరి అమ్మఒడి సభను వేలాదిమందితో నిర్వహించేందుకు కరోనా అడ్డు రాలేదా? అని అచ్చెన్న ఏపీ సర్కారుని ప్రశ్నించారు. షెడ్యూల్ రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన అనంతరం అచ్చెన్న ఇలా స్పందించారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ గతేడాది నుంచీ వైసీపీ ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నట్టుగా మారింది. ఎన్నికల సంఘం తాజాగా తెచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ ను 11 జనవరి 2021 న నిలిపివేస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎద్దేవా చేస్తూ.. “అయ్యా నిమ్మగడ్డ గారూ… హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతారా లేక చంద్రబాబు ఇంటికి వెళతారా..? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. “చెప్పండి ప్లీజ్..!” అంటూ ట్వీట్ చేశారు విజయసాయి.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్రంలోని పార్టీలు తమతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఈనెల 10వ తేదీన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలు జరపాలనే ఆయా పార్టీలు కోరుతున్నాయని వెల్లడించారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే కేంద్రం నుంచి ఆర్ధిక సంఘం నిధులు అందుతాయని కూడా ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా స్థానిక ఎన్నికలు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో అందరూ కలిసిరావాలని సూచించారు నిమ్మగడ్డ.
స్థానిక ఎన్నికల నిర్వహణను ఏపీ ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహించగలరని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈనెల 10 నిర్వహించిన ప్రెస్ మీట్ లో పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఏపీ ఉద్యోగులు ఎవరికీ తీసిపోరన్న ఆయన, ప్రకృతి విపత్తుల సమయంలోనూ ఎంతో కష్టించి పనిచేసిన ఘనత ఏపీ ఉద్యోగుల సొంతమన్నారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలోనూ వారు అదే స్ఫూర్తిని ప్రదర్శించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.
ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ పై ఉద్యోగ సంఘాలు విముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈనెల10వ తేదీన ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తనవంతుగా స్పందించారు. పోలింగ్ సిబ్బంది కరోనా బారినపడకుండా అన్ని రకాల భద్రత చర్యలు తీసుకుంటామని హామీ చేశారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో పోలింగ్ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. పోలింగ్ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఫేస్ మాస్క్ లు, శానిటైజర్లు.. ఇలా అన్నింటినీ అందించి, పలు ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకుంటామన్నారు.
ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ని రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేస్తూ ఎస్ఈసీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి 12 జనవరి 2021న ఎస్ఈసీ తరపున లాయన్ అశ్విన్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉందని… ఈనెల 23న తొలి దశ ఎన్నికలను నిర్వహించాల్సి ఉందని తెలిపారు. స్టే ఇవ్వడం వల్ల ఎన్నికల నిర్వహణలో జాప్యం కలుగుతుందని అన్నారు. ఎన్నికలను నిర్వహిస్తున్నారా? లేదా? అని అడుగుతూ ఇప్పటికే 4 వేల మెయిల్స్ వచ్చాయని అశ్విన్ కుమార్ కోర్టుకు విన్నవించారు. అయినా కేసును అత్యవసరంగా విచారించేందుకు హైకోర్టు ఒప్పుకోలేదు. తరుపరి విచారణను 18 జనవరి 2021కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మళ్లీ హైకోర్టులో వాదనలు షురూ అయ్యాయి.
ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం, దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అంతేకాదు, రాష్ట్ర ఎన్నికల సంఘం తెచ్చిన ఎన్నికల షెడ్యూల్ ని రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పును కూడా వెలువరించింది. ఈ నేపథ్యంలో డివిజన్ బెంచ్ లో దీన్ని సవాల్ చేస్తూ ఎస్ఈసీ పిటిషన్ వేశారు. 12 జనవరి 2021న ఎస్ఈసీ తరపున లాయన్ అశ్విన్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే పంచాయతీ ఎన్నికల రద్దు ఆదేశాలపై అత్యవసరంగా విచారణ జరిపించాల్సిన అవసరం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నెల 17 వరకు హైకోర్టుకు సెలవులు ఉన్నాయని… ఆ తర్వాత 18న రెగ్యులర్ కోర్టులో వాదనలు వింటామని తేల్చి చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం ఆధారంగా ఆర్డినెన్స్ తెచ్చే అవకాశముందని, ఆర్డినెన్స్ వస్తే ఎస్ఈసీ అధికారాలు, ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని నిమ్మగడ్డ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు 5 డిసెంబర్ 2020న రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 – కె ప్రకారం ఎన్నికల సంఘానికి స్వయం ప్రతిపత్తి ఉందని, కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి అధికారాలు ఉంటాయో, అందుకు సమానమైన అధికారాలే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఉంటాయని నిమ్మగడ్డ తన లేఖలో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరపడం ఎన్నికల కమిషన్ విధి అని, అలాకాకుండా ప్రభుత్వ అంగీకారం మేరకే ఎన్నికల తేదీలు ప్రకటించాలన్న ఆర్డినెన్స్ వస్తే దాన్ని తిప్పి పంపాలని సూచించారు. అవసరమైతే రాజ్యాంగ, న్యాయనిపుణులను సంప్రదించాలని కోరారు.
ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై 5 డిసెంబర్ 2020న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, ఒకవేళ అలాంటి ఆర్డినెన్స్ వస్తే తిరస్కరించండని ఆయన తన లేఖలో గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ వ్యతిరేకమని అని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.
జనవరి 8 2021న జారీచేసిన స్థానికసంస్థల ఎన్నికల ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు నిలిపివేసిన నేపథ్యంలో 12వ తేదీన రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఆయన, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంపై చర్చలు జరిపారు. ఎన్నికలకు సహరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన గవర్నర్ ను కోరారు.
2020 మే నెల వరకూ ఎన్నికల కమిషన్ ఇన్‌చార్జ్ కార్యదర్శిగా ఉన్న జీవీఎస్ ప్రసాద్ ను తప్పిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. అతని స్థానంలో 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి వాణీమోహన్ ను ఏపీ ప్రభుత్వం నియమించింది. అప్పటివరకూ సహకార శాఖ కమిషనర్ గా పనిచేస్తున్న జి.వాణీమోహన్ ను ఏపీ ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా నియమిస్తూ 2020 మే 30 రాత్రి (శనివారం) ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎస్ఈసీ నిమ్మగడ్డ వెనక్కి తగ్గలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జేవీ సాయిప్రసాద్‌ను విధుల నుంచి తొలగించిన తర్వాతి రోజే మరో వేటుకు సిద్ధమయ్యారు నిమ్మగడ్డ. ఎన్నికల సంఘం కార్యకలాపాలకు ఓ పథకం ప్రకారం విఘాతం కలిగించి, పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రయత్నించారనే అభియోగాలతో, జనవరి 12వ తేదీన ఎన్నికల కమిషన్ సెక్రటరీ వాణీమోహన్ ను విధుల నుంచి తొలగించారు నిమ్మగడ్డ. వాణీమోహన్ సేవలు ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో అవసరం లేదంటూ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు. ఈసీ కార్యాలయం నుంచి ఆమెను రిలీవ్ చేశారు.
ఒకానొకదశలో ఏపీ ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి హైకోర్టు మార్గనిర్దేశనం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగించుకోవడానికి చర్చలే మార్గమని తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సూచనల మేరకు జనవరి 8 2021న ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఇతర ఉన్నతాధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో భేటీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయని నిమ్మగడ్డకు సీఎస్ వివరించారు. దీనికి తోడు సిబ్బంది వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. అందువల్ల ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కాలేమని తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశాన్ని పునఃసమీక్షించుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికలను మరికొన్నాళ్లు వాయిదా వేయాలని కోరారు. అయితే, ఈ విషయంలో వెనక్కితగ్గని నిమ్మగడ్డ అనూహ్యంగా నోటిఫికేషన్ విడుదల చేసేశారు.
ఏపీ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈ ఉదయం ప్రారంభమైన విచారణ భోజన విరామ సమయం వరకూ వాడివేడిగా సాగింది. రాష్ట్రఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ, ఏపీ ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం కూడా ఏజీ వాదనలు వినిపించనున్నారు.
తాము వద్దని చెప్పినా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో జగన్ సర్కారు తీవ్ర ఆగ్రహానికి లోనైంది. ఎస్ఈసీ ఉత్తర్వులు వెలువడిన తర్వాతిరోజే హైకోర్టు మెట్లెక్కేందుకు రెడీ అయింది. అంతేకాదు, సంక్రాంతి సెలవులు కావడంతో హౌస్ మోషన్ దాఖలు చేసింది. న్యాయపరమైన పత్రాలను సిద్ధం చేసి.. జనవరి 9వ తేదీ ఉదయం 10.30 గంటలకు న్యాయమూర్తి ఇంటి దగ్గరే హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని విన్నవించింది.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు తమ వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల నిర్వహణ చేపడితే వచ్చే దుష్పరిణామాలను కోర్టుకు విన్నవించే ప్రయత్నం చేస్తున్నారు.
11 జనవరి 2021 న ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిలిపివేసిన నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. స్థానిక ఎన్నికల షెడ్యూల్‌పై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం సహేతుకంగా లేదని అభిప్రాయపడింది. ఎస్‌ఈసీ నిర్ణయం ఆర్టికల్స్ 14, 21ను ఉల్లంఘించినట్లు ఉందని పేర్కొంది.
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తూ ఎస్ఈసీ జారీ చేసిన ప్రొసీడింగ్స్, ఎన్నికల ప్రవర్తన నియమావళి విధింపు, బదిలీలపై నిషేధం ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జనవరి 9 2021 శనివారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఎన్నికల విషయంలో ముందుకెళ్లకుండా ఈసీని నిలువరించేలా ఆదేశించాలని, ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏపీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎన్నికల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
జనవరి 8వ తేదీ 2021 శుక్రవారం రోజున ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఈనెల 23న తొలి దశ, 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగోదశ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇక, ఫిబ్రవరి 5న తొలిదశ ఎన్నికలు, 7న రెండో దశ, 9న మూడో దశ, 17న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగుతుందని, పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని సదరు ఎన్నికల నోటిఫికేషన్ లో వెల్లడించారు.
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను జనవరి 11 2021 వ తేదీన హైకోర్టు రద్దు చేసింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు సరికాదని హైకోర్టు పేర్కొంది. ఎన్నికలు నిర్వహిస్తే అది కోవిడ్-19 టీకా కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తుందని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని లెక్కలోకి తీసుకోకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం తనంతటతానుగా నిర్ణయం తీసుకుందని వివరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వద్దని జగన్ సర్కారు తేల్చి చెబుతుంటే, రాష్ట్రఎన్నికల సంఘం మాత్రం ఎన్నికలు నిర్వహించాలన్న గట్టి పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టులో జరుగుతోన్న విచారణ రాజకీయపార్టీలను విశేషంగా ఆకర్షిస్తోంది. అటు అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయం ఎలా ఉండబోతోందన్న దానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని అటు, ఎన్నికల సంఘం, ఇటు, జగన్ ప్రభుత్వం రెండూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పావులు కదుపుతూ వస్తున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఈ వ్యవహారంలో మొదటి నుంచీ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఆదేశాలకు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్‌పై ఎస్ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. జీవీ సాయి ప్రసాద్ 30 రోజుల పాటు సెలవులపై వెళ్లి.. ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని భావించిన ఎన్నికల సంఘం, జీవీ సాయిప్రసాద్‌ను విధుల నుంచి తొలగించింది. ప్రభుత్వ సర్వీసుల్లో ప్రత్యేక్షంగా గానీ, పరోక్షంగా గానీ విధులు నిర్వహించడానికి వీలులేదని చెప్పింది. ఆర్టికల్ 243 రెడ్‌విత్, ఆర్టికల్ 324 ప్రకారం విధుల నుంచి సాయిప్రసాద్‌ని తొలగిస్తున్నట్లు ఎస్‌ఈసీ ఉత్తర్వులు జారీ చేసి ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో హైకోర్టు సింగిల్ బెంజ్ ఇచ్చిన తీర్పును సైతం రాష్ట్ర ఎన్నికల సంఘం సవాలు చేసింది.